SERP: సెర్ప్‌లో పదోన్నతులు, బదిలీలు! రంగం సిద్ధం చేసిన సర్కార్

by Kema Shiva Kumar |

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్దమైంది.

SERP: సెర్ప్‌లో పదోన్నతులు, బదిలీలు! రంగం సిద్ధం చేసిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్దమైంది. గత కొన్నేళ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి స్థానచలనం కలగనుంది. పదోన్నతులు కల్పించి బదిలీలు చేయనున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పచ్చజెండా ఉపారు. సెర్ప్ లో మొత్తం 3,974 మంది ఉద్యోగులు ఉండగా, వీరికి గత కొన్ని సంవత్సరాలుగా సాధారణ బదిలీలు కాలేదు. బదిలీలు చేపట్టాలని గత ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు ఉద్యోగ సంఘాల నాయకులు కోరినా ఫలితం లేదు. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాలు కేటాయించారు. పూర్తి స్థాయి బదిలీలు చేపడుతామని అప్పట్లో ప్రకటించారు. కానీ ఎక్కడా అమలు కాలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరి బదిలీలకు రంగం సిద్దమైంది.

వంద శాతం ఉద్యోగుల బదిలీ!

సాధారణ ఉద్యోగులతో పాటే సెర్ప్ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అయితే వందశాతం ఉద్యోగులను బదిలీ చేయాలని, అదే సమయంలో పదోన్నతులు కూడా కల్పించాలని సెర్పు ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రి సీతక్కను కోరారు. దీంతో ప్రక్రియ జాప్యం అవుతూ వస్తుంది. కొన్నేళ్లుగా సిబ్బంది ఒకే స్థానంలో పనిచేస్తుండడంతో అన్ని స్థాయిల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగులందరినీ స్థాన‌ చ‌ల‌నం క‌ల్పించాల‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెర్ప్ కేంద్ర కార్యాలయంలో ఎంతో మంది ప్రాజెక్టు మేనేజర్లు, జిల్లాల్లో డీపీఎం, ఏపీఎంలు, సీసీలుగా చాలా మంది ఒకే దగ్గర పాతుకుపోయారు. వీరికి పదోన్నతులు కూడా లేవు. కేంద్ర కార్యాలయానికి రావడం, సొంత జిల్లాలకు బదిలీ కావడం, పదోన్నతులు పొందడం ద్వారా ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నారు. పలు విభాగాల్లో ప‌నిచేస్తున్న సిబ్బంది ప్రమోష‌న్లు కల్పించనున్నారు. కొన్ని జిల్లాలలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగియగానే సెర్ప్ లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నారు.

Next Story