BRS: తెలంగాణతో రేవంత్‌ రెడ్డి‌కి ఏం సంబంధం

by Gantepaka Srikanth |

రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ కారులపై రేవంత్‌రెడ్డి తుపాకీని ఎక్కుపెట్టిన దొంగ అని.. ఆయన ఏమైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఆయన ఉద్యమకారుడా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.

BRS: తెలంగాణతో రేవంత్‌ రెడ్డి‌కి ఏం సంబంధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ కారులపై రేవంత్‌రెడ్డి తుపాకీని ఎక్కుపెట్టిన దొంగ అని.. ఆయన ఏమైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఆయన ఉద్యమకారుడా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా బజారు రౌడీలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో సర్పంచులు గ్రామాలలో అభివృద్ధి చేసిన బిల్లులపై తమకేమి సంబంధం అని మాట్లాడుతున్నారని.. మరి కేసీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించిన తెలంగాణ రాష్ట్రంతో రేవంత్‌రెడ్డి‌కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో రైతు భరోసా వేస్తున్నారని అన్నారు.

ఇదంతా రాజకీయ స్టంట్‌లో భాగమేనన్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఇంకా కల్లాలలో వడ్లు అలాగే ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందుతున్నా ధాన్యం సేకరణ అయిపోలేదని ఆరోపించారు. బోనస్ ఇచ్చినం అని రేవంత్ దొంగ మాటలు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణం జరిగిందని కేటీఆర్ చాలా స్పష్టంగా ఆరోపించారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని అన్నారు. దాదాపు రూ.11 వేల కోట్ల ధాన్యం టెండర్లలో ముఖ్యమంత్రి తిన్నారని.. ఈ కుంభకోణంలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మెడకు ఉచ్చు బిగియక తప్పదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, హనుమంతు షిండే, కార్పొరేషన్ చైర్మన్లు కె.వాసుదేవరెడ్డి, గాంధీ నాయక్ పాల్గొన్నారు.

Next Story