iBOMMA రవి అడిషనల్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-12 15:21:21  IST  )

పైరసీ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రవిపై పోలీసులు దాఖలు చేసిన అడిషనల్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. iBOMMA వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే, వినియోగదారులను నేరుగా ఇతర బెట్టింగ్ యాప్‌లకు రీడైరెక్ట్ చేసే లింక్‌లను రవి ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

iBOMMA రవి అడిషనల్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA రవి అరెస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. సినిమాల పైరసీ కేసులో అరెస్టు అయిన రవి కస్టడీ నిన్నటితో ముగిసింది. ఐదు రోజుల పాటు వివిధ అంశాలపై రవిని ప్రశ్నించిన అధికారులు.. అతనిపై అడిషనల్ ఛార్జ్‌షీట్‌ ధాఖలు చేశారు. ఈ పైరసీ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రవిపై పోలీసులు దాఖలు చేసిన అడిషనల్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి ఉపయోగించిన అనేక డొమైన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా, ఈ డొమైన్‌లను అతను యూఎస్ డాలర్ల (USD) ద్వారా కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌లను కూడా పోలీసులు సేకరించారు.

దర్యాప్తులో, iBOMMA వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే, వినియోగదారులను నేరుగా ఇతర బెట్టింగ్ యాప్‌లకు రీడైరెక్ట్ చేసే లింక్‌లను రవి ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీనికి అదనంగా, ప్రతి డొమైన్‌కి ఒక్కో ప్రత్యేకమైన కోడ్ ఉపయోగించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రవి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగా, అతడు అనేక అనుబంధ కంపెనీలను సృష్టించి, వాటిని ER ఇన్ఫోటెక్ అనే మెయిన్ కంపెనీకి అనుసంధానం చేశాడు. అత్యంత కీలకంగా, ఈ మెయిన్ కంపెనీ అమెరికా (US) కేంద్రంగా ఉన్నప్పటికీ, అది పూర్తిగా నిందితుడు రవికి చెందినదేనని పోలీసులు నిర్ధారించారు.

ఈ కంపెనీల వలయం ద్వారానే అతను అక్రమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు, ట్రేస్ చేయకుండా తన కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇక అరెస్ట్ సమయంలో సాక్ష్యాలను దాచేందుకు రవి చేసిన ప్రయత్నాలు కూడా ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. అరెస్ట్ సమయంలో గంట సేపు ఎందుకు బయటికి రాలేదని ప్రశ్నించగా, తన ల్యాప్‌టాప్‌ను బాత్రూంలో, ముఖ్యమైన హార్డ్‌డిస్క్‌లను లేడీస్ డ్రెస్సింగ్ టేబుల్ కింద దాచినట్లు రవి ఒప్పుకున్నాడు. ఈ అడిషనల్ ఛార్జ్‌షీట్ రవి ఆర్థిక మూలాలను, సాంకేతిక ఏర్పాట్లను, సాక్ష్యాలను మాయం చేసేందుకు అతను చేసిన ప్రయత్నాలను స్పష్టం చేస్తూ, ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది.

Next Story