- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య, ఆరోగ్య శాఖలో సంచలనం.. ఏకంగా మంత్రికే లీగల్ నోటీసులు
వైద్య, ఆరోగ్య శాఖలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య, ఆరోగ్య శాఖలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. కోఠిలో ఉన్న డీహెచ్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ హరిపై లైంగిక వేధింపులు, అవినీతి, దౌర్జన్యాలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదే కార్యాలయంలో పనిచేసే బాధితురాలు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, డీహెచ్ కు లీగల్ నోటీసులు పంపారు. దళిత మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధితురాలి ఆరోపణల మేరకు... తన డిప్యూటేషన్ పోస్టును ఇచ్చేందుకు సూపరింటెండెంట్ హరి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.1లక్షకు ఒప్పుకొని అడ్వాన్స్ గా రూ.50వేలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. కానీ డిప్యూటేషన్ ఆర్డర్ ఇవ్వకుండా ఆమెను లైంగికంగా వేధిస్తూ అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులో ఆరోపించారు. లైంగిక వేధింపులతో పాటు, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారంటూ ఆమె పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆధారాలతో లీగల్ నోటీసు పంపించారు. గత రెండేళ్లుగా హరి డిప్యూటేషన్లు, ప్రమోషన్ల పేరుతో రూ.60 లక్షలకు పైగా లంచం వసూలు చేసినట్లు ఆరోపించారు. సూపరింటెండెంట్ హరిని తక్షణమే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని, డిపార్ట్ మెంట్‌లో అవినీతి వ్యవహారాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సాక్షాత్తు డీహెచ్ కార్యాలయంలోనే లైంగిక వేధింపులు..
వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్కువగా మహిళా ఉద్యోగులే పనిచేస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరం వరకు ఈ శాఖలో మహిళల పాత్ర ఎంతో ఉంటుంది. గ్రామాల్లో ఆయాలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ, సీహెచ్సీల్లో స్టాఫ్ నర్సులు, సీహెచ్ఓలు, వైద్యాధికారులు, ఇలా అనేక మంది మహిళా ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తారు. అయితే వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్రమంతటికీ ముఖ్య కార్యాలయమైన డీహెచ్ కార్యాలయంలోనే మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపిస్తూ లీగల్ నోటీసులను ఏకంగా శాఖ మంత్రికే పంపడం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చింది కానీ భయంతో భయటకు రాకుండా లోలోపల మానసిక వేదన పడుతున్న వారెందరో ఉన్నారనే చర్చ నడుస్తోంది.
సాక్షాత్తు శాఖ ప్రధానాధికారి పనితీరే సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు ఉన్నతాధికారుల అండదండలతోనే అక్కడ హరి లాంటి అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. డీహెచ్ కార్యాలయంలోనే ఇటువంటి దారుణ ఘటనలు చోటు చేసుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఉద్యోగుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నోటీసుల కాపీలు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ కమిషనర్, ఎస్సీ కమిషన్, నేషనల్ వుమెన్ కమిషన్‌లకు కూడా పంపినట్లు సమాచారం. ఒక ఎస్సీ మహిళా ఉద్యోగి ఈ స్థాయిలో ధైర్యంగా లీగల్ నోటీసు ఇచ్చి, ఆధారాలతో ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం అప్రమత్తం చేసినట్లుగా భావిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగడంతో పాటు, డిపార్ట్‌మెంట్‌లో అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితులను ఈ వ్యవహారం తేటతెల్లం చేస్తోంది. అవినీతి, లైంగిక వేధింపుల చర్యలకు పాల్పడిన వారిని విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.






