- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కవిత పార్టీ పేరు ఖరారు!
తన కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌లో జాప్యంపై కవిత హైకోర్టును ఆశ్రయించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటం పట్ల తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 23న తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం సీఈసీకి దరఖాస్తు చేసుకోగా ఈసీఐ వైపు నుంచి చర్యలు లేకపోవడంతో తమ దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తాజాగా కవిత హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్‍పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.
దరఖాస్తులో లోపాలు:
అయితే కవిత చేసిన దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల సంఘం అందులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈసీఐ తెలిపింది. ఈ విషయాన్ని కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపించామని ఈసీఐ తరపు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం. అయితే ఆ రోజు కవిత తరపు ముఖ్య న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడిందని ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ కు షాకిచ్చేలా:
బీఆర్ఎస్‍లో జరిగిన పరిణామాల అనంతరం సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే కవిత ప్రకటించింది. ఉగాది నాటికి కొత్త పార్టీ అనౌన్స్ చేస్తానని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు కసరత్తు జరిగినా రిజిస్ట్రేషన్ లో జాప్యం కారణంగా పార్టీ ప్రకటనలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపైనే ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తయి అధికారికంగా పార్టీ ప్రకటన జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. అయితే కవిత ఏర్పాటు చేయబోతున్న పార్టీ పేరుతో తెలంగాణ పేరు ఉండటంతో బీఆర్ఎస్ ను టార్గెట్ గా ఆమె కసరత్తు ఉండబోతున్నదనే చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గా ఉన్న పార్టీ ఆ తర్వాత తన పేరులో తెలంగాణ పదం లేకుండా భారత రాష్ట్ర సమితి (BRS) గా మార్చుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్‍కు పేగు బందం తెగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కవిత తన పార్టీ పేరులో తెలంగాణ పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఆసక్తిని రేపుతోంది.






