- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీసీసీఎఫ్ నియామకంపై వివాదం.. కీలక పోస్టుపై లాబీయింగ్ ఆరోపణలు
అటవీశాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF)పదవిని సీనియార్టీ ప్రకారం కాకుండా, జూనియర్ ఆఫీసర్‌కు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అటవీశాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF)పదవిని సీనియార్టీ ప్రకారం కాకుండా, జూనియర్ ఆఫీసర్‌కు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు అవమానంగా భావిస్తూ, కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పీసీసీఎఫ్‌గా పని చేస్తోన్న సువర్ణ పదవీకాలం ఈ నెల 30తో ముగియనున్నది. ఆమె స్థానంలో జూనియర్ అధికారిగా ఉన్న సునీతా భగవత్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది.
ఐపీఎస్ భార్యకు..
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పదవిని సర్వీసులో సీనియార్టీ, పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ ఈసారి మాత్రం సీనియార్టీతో సంబంధం లేకుండా లాబీయింగ్ కు పెద్దపీట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పోలీసుశాఖలో కీలకహోదాలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి భార్యకు ఆ పదవి కట్టబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సీనియారిటీ ఇలా..
ప్రస్తుతం పీసీసీఎఫ్‌గా పనిచేస్తోన్న సువర్ణ తరువాత సీనియార్టీ లిస్టులో మొదటి వరసలో వినయ్ కుమార్ (1992) ఉన్నారు. ఆయన తరువాత రత్నాకర్ జౌహరి (1994) ఉన్నారు. కానీ ఆ ఇద్దరు సీనియర్లను పక్కన పెట్టి జూనియర్ అధికారిగా ఉన్న సునీతా భగవత్ (1996) ను ఎంపిక చేసేందుకు నిర్ణయం జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. జూనియర్ ఆఫీసర్‌కు మద్దతుగా కొందరు బ్యూరోక్రాట్స్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేయడంతో ప్రభుత్వం సునీతా ఎంపికవైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
మంత్రి లేఖ రాసినా..
సీనియార్టీ ప్రకారం పీసీసీఎఫ్ పదవిని కేటాయించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసినట్టు తెలిసింది. జూనియర్లకు ఇవ్వడం వల్ల డిపార్ట్ మెంట్‌లో అధికారుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే మంత్రి అభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వం మాత్రం సునీతా భగవత్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సీనియర్ అధికారులు వినయ్ కుమార్ (1992), రత్నాకర్ జౌహరి (1994) కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. తమ జూనియర్ అధికారి వద్ద పనిచేయడాన్ని సదరు అఫీసర్లు అవమానంగా భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
రిటైర్డ్ అధికారే కనుసన్నల్లో అటవీశాఖ!
రాజ్యాంగహోదాలో పనిచేస్తోన్న ఓ రిటైర్డ్ బ్యూరోక్రాట్ కనుసన్నల్లోనే అటవీ శాఖలో నిర్ణయాలు జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పీసీసీఎఫ్ ఎంపిక విషయంలో ఆయనే చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య హెచ్ఎండీఏలో పనిచేస్తోన్న అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్‌ను ఆకస్మికంగా బదిలీ చేసి, ఆ స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్‌కు సన్నిహిత బంధువును అపాయింట్ చేశారు. ఈ బదిలీ నిర్ణయం వెనుక సదరు రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ప్రచారాన్ని ఆ రిటైర్డ్ అధికారి సన్నిహితులు ఖండిస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తులు ఎవరినీ కలిసేందుకు ప్రయత్నించరు. ఆయన కూడా రిటైర్డ్ అయిన తరువాత ప్రభుత్వంలో ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదు. అటవీశాఖలో జరుగుతోన్న విషయాలను ఆయన పట్టించుకోరు. కొందరు కావాలని ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’అంటూ వివరించారు.






