శాంతి కుమారి వీఆర్ఎస్.. తెలంగాణ నెక్ట్స్ CS ఇతనే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-04 23:00:27  IST  )

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు నియమితులుకానున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

శాంతి కుమారి వీఆర్ఎస్.. తెలంగాణ నెక్ట్స్ CS ఇతనే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు నియమితులుకానున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్​కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్​గోయల్​తరువాత సీనియర్‌గా రామకృష్ణారావు ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకున్న అనుభవం తొడ్పడుతుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయనను సీఎస్‌గా నియమించాలనే ఆలోచన చేసినట్లుగా సమాచారం.

రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్​కలెక్టర్‌గా, గుంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత సీఎస్​శాంతి కుమారి తన సర్వీసుకు వీఆర్‌ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఆమె వీఆర్ఎస్​నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లుగా సమాచారం. దీంతో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. వాస్తవంగా శాంతి కుమారి ఈనెలఖరున పదవీ విరమణ చేయనున్నారు. అంత కంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్​తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది.

1989 బ్యాచ్​ఐఏఎస్‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేశ్​ కుమార్ ఏపీకి అలాట్ కావడంతో ఆమె సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. వీఆర్‌ఎస్​ తరువాత శాంతి కుమారి ని చీఫ్​ఇన్ఫర్మేషన్​కమిషనర్‌గా నియమించనున్నట్లుగా సమాచారం. ఆమె నియామకం ఇప్పటికే ఖరారు అయిందని, కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని తెలిసింది. వచ్చే వారం సమాచార కమిషనర్‌లకు సంబంధించిన నియామక సమావేశం జరగనున్నట్లుగా తెలిసింది. సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆమెతో పాటు మరికొందరు సమాచార కమిషనర్‌లుగా నియమించనున్నట్లుగా తెలిసింది. గత కొన్నాళ్లుగా ఖాళీగాఉన్న సమాచార కమిషనర్‌ల పోస్టులు భర్తీ కానున్నాయి.

Next Story