- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడకత్తెరలో ఉన్నతాధికారులు..! వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి
గత పాలకులు, ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలకు కొందరు ఉన్నతాధికారులు బలయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గత పాలకులు, ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలకు కొందరు ఉన్నతాధికారులు బలయ్యారు. ప్రజాప్రతినిధులుగా వారు తీసుకున్న అనధికార నిర్ణయాలు, నోటి మాటగా జారీ చేసిన ఆదేశాలను పాటించడం, వారి మెప్పు పొందడానికి అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు అధికారులు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు. పదోన్నతులు, డిప్యూటేషన్స్, అనుకున్న శాఖల్లో ఉన్నతాధికారి హోదా, సంపాదన కోసం ఏరికోరి పోస్టులను ఎంచుకున్న అధికారులు.. నాడు తీసుకున్న నిర్ణయాలు వల్ల ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. తోటి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు సైతం అసహ్యించుకునే స్థితికి చేరుకున్నారు. గత ప్రజాప్రతినిధులు తీసుకున్న అనధికారిక నిర్ణయాలను ఉన్నతాధికారులు సమర్థించడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. పాలకులు తప్పులు చేస్తున్నారని తెలిసినప్పుడు ఎదురుచెప్పి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. నాడు మౌనంగా ఉన్నందుకే ఈ పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు అధికారులపై ఇప్పటికే కేసులు నమోదవ్వగా.. ఏసీబీ, సిట్, కాళేశ్వరం కమిషన్ ఎదుట పలువురు ఆఫీసర్లు హాజరైనట్లు తెలిసింది. అసలు తప్పులు చేసిన ప్రజాప్రతినిధులు మాత్రం హాయిగా తప్పించుకుని తిరుగుతుండగా.. అధికారులు మాత్రం ఊచలు లెక్కించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ నిర్ణయం అధికారులదే.. కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో రెండున్నర టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వచేయడానికి వీల్లేదని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే, 16 టీఎంసీల వరకు గత సర్కారు నీటి నిల్వ చేసింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. డ్యామ్‌లో అయితే నిల్వ చేయొచ్చు. కానీ, బ్యారేజీల్లో ఇంత నీటిని నిల్వ చేయడం ప్రమాదకరం అని నీటిపారుదల శాఖలో ఏ అధికారిని అడిగినా చెబుతారు. మేడిగడ్డ కుంగడానికి ఇది కూడా ఓ కారణం అని చెబుతున్నారు. నాటి ఇంజినీర్లు తమకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నీటిని నిల్వ చేశామని, సీఎంగా ఉన్న ఆయనకు తాము ఎదురుచెప్పలేకపోయామని కమిషన్ ఎదుట పేర్కొన్నారు.. కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మాత్రం తాము నీటి నిల్వపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అది తమ పనికాదని కాళేశ్వరం కమిషన్ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఇలా అనేక అంశాల్లో గత సీఎం, మంత్రుల ఆదేశాలను తూచా పాటించామని అధికారులు విచారణ అధికారులకు చెప్పుకొచ్చారు. కానీ, గత సీఎం, మంత్రులు మాత్రం మాకేం సంబంధం లేదని చేతులెత్తేశారు. విజిలెన్స్నివేదికలో గత ఇంజినీర్ల పేర్లు ఉండటంతో వారికి పదోన్నతులు నిలిచాయి.
ఫోన్ ట్యాపింగ్‌కు మాకు సంబంధం లేదు..
ఎన్నికలకు ముందే ఫోన్ ట్యాపింగ్ విషయంపై అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్అనేక సార్లు ప్రస్తావించారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గట్టిగా చెప్పుకోచ్చారు. చివరకు అదే నిజమైంది. గతంలో సీఎం, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు చెప్పిన నెంబర్లను ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట ఆనాడు కీలకంగా వ్యవహరించిన అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, గత బీఆర్ఎస్ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం తమకేమీ సంబంధం లేదు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న వారిగా తమకు సమాచారం కావాలి. అధికారులు ఎలా తీసుకువస్తారనేది తమకేం సంబంధం అన్నట్లుగా చెబుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహరంలో ఐఏఎస్‌లు, కీలక హోదాలో ఉన్న ఐపీఎస్‌లు సైతం ఇరుక్కొని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆనాడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ట్యాపింగ్ నేరం అనే విషయం తెలియక కాదు. తమ పదవులు, హోదాలను కాపాడుకోవడానికి అప్పటి పాలకులకు ఎదురుచెప్పకుండా చేసిన పనులు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. ఆ నాడే వ్యతిరేకించి ఉండి ఉంటే తాము ఉన్నత స్థానాల్లో ఉండేవారం కాదని వారికి కూడా తెలుసు. కేవలం పదవుల కోసం తప్పుడు నిర్ణయాలకు మద్దతుగా నిలిచారని చెప్పకనే అర్థం అవుతోంది.
ఆ అధికారి అత్యుత్సాహం..
నాడు సమాచార కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఒక సీనియర్ఐఏఎస్ చూపిన అత్యుత్సాహం ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఐఏఎస్‌గా ఉండి అనేక అంశాలపై రాజకీయ ప్రకటనలు, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. నేడు ఆయన ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో ఆ అధికారి అపరిమిత అధికారాన్ని చెలాయించారు. ఆయన చేతిలోనే కీలక శాఖలు ఉండేవి. దీంతో ఆయన ఎంతంటే అంత అన్నట్టుగా నడిచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆయనే ఘాటుగా స్పందించేవారు. మీడియాపైనా తన ప్రతాపం చూపేవారు. ఈ క్రమంలోనే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడెషన్కమిటీ మంజూరు చేసిన కార్డులను సైతం అందకుండా కార్యాలయంలోనే రహస్యంగా దాచిపెట్టిన నీచ చరిత్ర ఆ అధికారిది.
తీరా చూస్తే ఇదే అధికారి పరిశ్రమలు స్థాపించిన వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు రావడం లేదని ఒక పరిశ్రమల యూనియన్నాయకుడు స్టేట్మెంట్ ఇస్తే.. వెంటనే పరిశ్రమల శాఖ అధికారికి ఫోన్‌చేసి.. ఆ నాయకుడికి వార్నింగ్ఇవ్వాలని, లేకుంటే అన్ని కట్‌చేస్తామని హెచ్చరించిన చరిత్ర కూడా ఆయనకు ఉన్నది. ఆ సమయంలో సదరు అధికారి ఏ మాత్రం సంబంధంలేని శాఖలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. ఆయనే నేడు ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సైతం నిబంధనలు పాటించకుండా వచ్చేది మరల తమ ప్రభుత్వమే అన్నట్లు వ్యవహరించడంతోనే చిక్కుల్లో పడ్డారు. అప్పటి ఆయన పనితీరుపై లోతుగా ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దల మెప్పు, పదోన్నతుల కోసం గత ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు తోటి వారిని సైతం అభాసుపాలు చేసింది.






