- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుది దశకు చేరిన ‘డీసీసీ’ల ఎంపిక.. నేడు ఢిల్లీలో కీలక సమావేశం
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక చివరి ప్రక్రియ హస్తినకు చేరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక చివరి ప్రక్రియ హస్తినకు చేరింది. ఏఐసీసీ పరిశీకులు సేకరించిన జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనాయకుల అభిప్రాయాలను తీసుకోవడానికి నేడు ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ను ఏఐసీసీ పెద్దలు ఢిల్లీకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకోగా, సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. డీసీసీ అధ్యక్షుల మార్గదర్శకాలపై స్పష్టత కోసం మరోసారి చర్చించనున్నారు. అనంతరం శనివారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఇందులో ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు రాష్ట్రంలో పర్యటించి డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వారి సైతం అభిప్రాయాలను నమోదు చేశారు. అలాగే ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకుల నుంచి ఒపీనియన్ తెలుసుకున్నారు.
ఏఐసీసీ చెంతకు లిస్టు
మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న వారి పేర్లను ఏఐసీసీకి నేడు అందజేయనున్నారు. వారి జాబితాను సమావేశంలో రాష్ట్రనేతల ముందు ఉంచుతారు. ఆ లిస్టు ఆధారంగా రాష్ట్ర కీలక నేతలు వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారం నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అవసరమైతే మరోసారి సీఎం, పీసీసీ అధ్యక్షుడిని సంప్రదించే అవకాశం ఉంది. అనంతరం జాబితాను ఖరారు చేయనున్నారు.
మార్గదర్శకాలకు చెల్లు!
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు ఏఐసీసీ పలు మార్గదర్శకాలు ఖరారు చేసింది. కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని, అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధుల సమీప బంధువులకు అవకాశం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు ఎవరికి కూడా మరోసారి అవకాశం లేదని స్పష్టమైంది. అయితే ఏఐసీసీ మార్గదర్శకాలను బహిరంగపరిచినా అనేక జిల్లాలకు చెందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు మరోసారి తమకు అవకాశమివ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాప్రతినిధుల బంధువులకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వబోమని చెప్పినా పలువురు నేతలు అప్లై చేసుకున్నారు. అలాంటి వారి పేర్లను తొలగిస్తారా? లేక ఉంటాయా? అన్నది శనివారం నాటి జాబితాతో స్పష్టత రానుంది.
డీసీసీలకు భారీ డిమాండ్
రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షులు కీలకం కానుండటంతో డీసీసీ పదవులకు భారీ డిమాండ్ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవీ కీలకం కావడంతో కుర్చీ దక్కించుకోవడానికి నాయకులు పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో డీసీసీలను క్రీయాశీలం చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఢిల్లీలో శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. డీసీసీలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల పేర్లను సూచించిన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఈ పదవులను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పరిశీలకుల వద్ద బలప్రదర్శన చేశారు. తమకు అనుకూలంగా వారి వద్ద అభిప్రాయాలు చెప్పే విధంగా లాబీయింగ్నడిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కీలక నేతలకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక సవాల్‌గా మారనుంది. తమ అనుకూల వ్యక్తుల పేర్లు సూచించేందుకు సిద్ధమయ్యారు. అయితే నాయకులు సూచించే జాబితాలో సామాజిక కోణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల్లో ఉపకులాలు, ఓసీల్లో కులాల వారీగా పదవులు వచ్చే విధంగా చూడాల్సి ఉంటుంది. ఈ జాబితాపై నాయకుల అభిప్రాయాలను స్వీకరించి జాబితాకు తుదిరూపు ఇవ్వడానికి మరికొంత సమయం తీసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్జిల్లాలో జూబ్లీహిల్స్ఉపఎన్నిక జరుగుతున్నందున పేర్లను తర్వాత ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.






