Seetha DayakarReddy: నిజమైన దిశ కథనం.. చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి నియామకం

by Prasad Jukanti |   (  Updated:2025-04-04 09:51:48  IST  )

చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు.

Seetha DayakarReddy: నిజమైన దిశ కథనం.. చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి నియామకం
X

దిశ, డైనమిక్ బ్యూరో/ మహబూబ్ నగర్ బ్యూరో/దేవరకద్ర: తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TG Child Rights Commission) చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని (Seetha DayakarReddy) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించింది. కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బాధ్యతలు స్వీకరిచిన రోజు నుంచి మూడు సంవత్సరాలు లేదా వారికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సీతాదయాకర్ రెడ్డికి నియామకపు ఉత్తర్వులు అందడంతో ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ముందే చెప్పిన దిశ:

2009లో మహబూబ్ నగర్ (Mahbub Nagar) జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యేగా పని చేసిన కొత్తకోట సీతాదయాకర్ రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ పదవి వరించబోతున్నదని దిశ దినపత్రిక ముందే చెప్పింది. 20 రోజుల క్రితం 'చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి?' అనే శీర్శికతో కథనాన్ని వెలువరించింది. ఆ కథనాన్ని నిజం చేస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం వెలువడింది. కాగా 1994లో రాజకీయాలలోకి ప్రవేశించిన సీతా దయాకర్ రెడ్డి 2001 లో దేవరకద్ర జడ్పీటీసీ సభ్యురాలుగా విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. అప్పట్లో అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష నేతల అభినందనలు అందుకునేలా విధులు నిర్వహించారు. 2009లో దేవరకద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అదే సమయంలో ఆమె భర్త దయాకర్ రెడ్డి సైతం మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఒకే సమయంలో భార్యాభర్తలు అసెంబ్లీలో ప్రవేశించిన ఘనతను సాధించారు. 2014లో దేవరకద్ర ఎమ్మెల్యేగా సీతాదయాకర్ రెడ్డి రెండవసారి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన సీతా దయాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విద్యార్హతలు ఉన్న కారణంగా సీతా దయాకర్ రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా ప్రభుత్వం ఎంపిక చేసింది.

Next Story