23 నుంచి విత్తన మేళా.. 2601 రైతు వేదికల్లో 7 రకాల వరి విత్తనాలు

by Ajay Maddhiboyina |

వానాకాలం సీజన్​లో 7 రకాల సన్నాలు సాగు చేసేందుకు విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు చేపడుతోంది. అందుకోసం ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల్లో నాలుగు రోజుల పాటు విత్తన మేళా నిర్వహించేందుకు ప్లాన్ ​చేస్తోంది.

23 నుంచి విత్తన మేళా.. 2601 రైతు వేదికల్లో 7 రకాల వరి విత్తనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సీజన్​లో 7 రకాల సన్నాలు సాగు చేసేందుకు విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు చేపడుతోంది. అందుకోసం ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల్లో నాలుగు రోజుల పాటు విత్తన మేళా నిర్వహించేందుకు ప్లాన్ ​చేస్తోంది. ఇప్పటికే దీనికి ఏర్పాట్లు చేయాలని మండల వ్యవసాయాధికారులకు సూచనలు చేసినట్టు తెలిసింది. ఖరీఫ్​ సీజన్​కు 15 లక్షల మెట్రిక్​టన్నులు విత్తనాల వినియోగం ఉంటుందని వ్యవసాయ శాఖ భావించినా.. ఎల్​నినో ప్రభావంతో సాగు ముందు అంచనా వేసినదానికంటే తగ్గనుంది. సుమారు 37 లక్షల నుంచి 40 లక్షల ఎకరాల్లో వరి పంట వేయవచ్చని అంచనా వేస్తున్నారు. వీటికి 9 లక్షల మెట్రిక్​టన్నులు విత్తనాలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం తక్కువ ధరకే విక్రయిస్తున్న 7 రకాల సన్నాల విత్తనాలు ప్రయివేట్ విత్తన దుకాణాల వద్ద లభించడం కష్టమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రయివేటు డీలర్లు ఈ 7 రకాలు అమ్మకుండా మిగతా వాటిని ఇప్పటికే దుకాణాల్లో నిల్వ చేశారు. ప్రభుత్వం అందించే రకాలకంటే తాము అమ్ముతున్న వడ్లకే కమిషన్ ​ఎక్కువగా వస్తోందని, తప్పుడు ప్రచారం చేస్తూ విత్తనాలు అమ్ముడు పోయేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సాగు కాలం ప్రారంభమైన ప్రభుత్వం ప్రకటించిన విత్తనాలు సరఫరా చేయలేదని, బోనస్​ వీటికి చెల్లిస్తామని చెప్పి గుట్టుగా ఆపంట సాగు చేయకుండా ప్లాన్​ చేస్తోందని రైతులకు చెబుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు డీలర్ల మాటలు నమ్మి మోస పోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు ప్రయివేటు దుకాణాల్లో విత్తనాలు కొనేటప్పడు సర్టిఫైట్​ సీడ్​ మాత్రమే కొనాలని, ప్యాకెట్​పై ఉన్న వివరాలు పరిశీలించాలని, మొలక శాతం, తయారీ తేదీ గమనించాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అధికారిక డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. సాధారణ విత్తనం ఎకరానికి 12 నుంచి 15 కిలోలు, రెండు ఎకరాలకు 24 నుంచి 30 కిలోలు, ఐదు ఎకరాలకు 60 నుంచి 75 కిలోలు అవసరం ఉంటుంది. పంట అధిక దిగుబడి రావాలంటే ధృవీకరించిన విత్తనాలు మాత్రమే ఉపయోగించాలి. నేల పరీక్షలు తప్పక చేయించుకుని, సమయానికి నారు పోయాలి. నీటి నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు వ్యవసాయ శాఖ సూచనలు రైతులు తప్పకుండా పాటించాలి.

రైతుల ఆసక్తి

రాష్ట్రంలో సన్నరకాల విత్తనాలు ఎన్నో ఉండగా రోగాలు సోకని, తక్కువ కాలంలో కోతకు వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన 7 రకాల్లో మొదటి రెండు రకాలు 130 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తాయి. తరువాత మూడు రకాలు 120 నుంచి 130 రోజులు పంట చేతికొస్తుంది. ఇతర రకాల సన్నాలు 120 రోజుల లోపే కోత కోయవచ్చు. స్వల కాలంలో వచ్చే పంటల పట్ల రైతులు ఆస్తకి చూపుతున్నారు. వానాకాలం సాగుకు సిద్ధమైన రైతులు వరి ఇప్పటికే విత్తనాలు కొంటున్నారని, వ్యవసాయ శాఖ చెబుతున్న ఏడు రకాల సన్నాలు వేయాలనే నిబంధనలతో సాగు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఇక సన్నాలు గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. బియ్యపు గింజ పొడువు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటేనే బోనస్ ​ఖాతాలో జమ చేయనుంది. గ్రెయిన్​కాలిపర్ ​అనే మిషన్ ​ద్వారా గింజ పొడువు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడువు 6 ఎంఎం, వెడల్పు 2 ఎంఎం కంటే తక్కువగా ఉండాలి. పొడువు, వెడల్పుల నిష్పత్తి 2.5 ఎంఎం కంటే ఎక్కువ ఉండే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ధాన్యం తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలనే నిబంధనలున్నాయి.

బోనస్ ఎగవేతకోసమే

ప్రభుత్వం సన్నాలు సాగు చేసేందుకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రూ.500 బోసస్​ ఎగనామం పెట్టడానికి 7 రకాల వరి వేయాలనే నిబంధనలు తీసుకొచ్చిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బోనస్​ పంపిణీతో రాష్ట్రంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపి గత రెండు సీజన్​లో పెద్ద మొత్తంలో పంట ఉత్పత్తి చేశారు. దీంతో ప్రభుత్వంపై బోనస్​ భారం అనుకున్న దానికంటే ఎక్కువైంది. అందుకోసం కొన్నింటికి మాత్రమే బోనస్​ ఇస్తామని చెబితే అధికంగా సాగు చేయడం సాధ్యంకాదు. దీంతో బోనస్​ భారం నుంచి బయట పడవచ్చని భావిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్​నినో ప్రభావంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్​లో మధ్యంతర కరువు వస్తుందనే ప్రచారంతో రైతులు ఈసారి సగానికిపైగా వరి సాగు తగ్గించ వచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story