- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూములపై బడాబాబుల కన్ను!
గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ భూములను పెద్దలు కబ్జా చేస్తున్న పట్టింపు లేదు. కనీస చర్యలు లేవు.

దిశ,వరంగల్ బ్యూరో: గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ భూములను పెద్దలు కబ్జా చేస్తున్న పట్టింపు లేదు. కనీస చర్యలు లేవు. బడా భవనాలు నిర్మాణం చేస్తున్న ఆపడం లేదు. పేదలు గుడిసెలు వేసుకుని ఉంటే మాత్రం భారీ బలగాలు, బుల్డోజర్లతో వస్తూ తొలగిస్తున్నారు. వారి సామాను సర్దుకునేందుకు సమయం ఇవ్వడం లేదు. అధికార , విపక్ష పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రేటర్ పరిధిలో ఎక్కడా ప్రభుత్వ భూమి ఉన్నా కబ్జాకు యత్నిస్తున్నారు. కొత్త సర్వే నెంబర్లు పుట్టిస్తూ కబ్జా చేస్తున్నారు. భారీ భవంతుల నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువు శిఖాల నుంచి విద్యాసంస్థల భూముల వరకు కబ్జాలు జరిగిన గప్ చుప్‌గా ఉంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడం లేదు.
ఈ కబ్జాలకు కొంత మంది రెవెన్యూ అధికారులు,ప్రజాప్రతినిధులు అండగా ఉండటంతో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. గ్రేటర్ పరిధితో పాటు కూడా పరిధిలోని భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. గ్రేటర్ పరిధిలో పలుచోట్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికావడంతో పాటు భారీ ఎత్తున భవనాలు వెలిశాయి. కొన్ని భూముల్లో ఇండ్ల నిర్మాణం జరుగగా మరికొన్ని భూముల్లో అపార్ట్ మెంట్లు వెలిశాయి. కబ్జా అంతా పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అధికారంలో ఎవరు ఉన్నా కబ్జాలు మాత్రం ఆగలేదు. చివరకు వాగులు, నాళాలను, కుంటలను కబ్జా చేయడం వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పలు కాలనీలు వరదతో ముంచెత్తుతున్నాయి.
లేఖలు రాసిన ఫలితం లేదు..
వరంగల్ నగరంలో ఎటు చూసిన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. దేవాలయాలు, వక్స్ బోర్డు, సాగునీటి శాఖకు చెందిన భూములతో పాటు కేయూ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు కూడా కబ్జాలకు గురయ్యాయి. వరంగల్ పరిధిలోని ఉర్సు పరిధిలో వక్స్ బోర్డుకు సంబంధించిన భూములు భారీగా కబ్జాకు గురయ్యాయి. ఈ మధ్యనే వరంగల్ కలెక్టర్ ఆ భూముల సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో కొత్త కబ్జాలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఆర్కెయాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన భూముల కబ్జాకు గురైన పట్టించుకోవడం లేదు. ఆ శాఖ అధికారులు, జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులకు పలు దఫాలు లేఖలు రాసిన ఫలితం లేదు. ఇప్పటికి కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోలేదు. కాజీపేట మండలం శాయంపేట పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాగా ఈ మధ్యనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడ్డెపల్లి పరిధిలో బతుకమ్మ బండతో పాటు చెరువుకు సంబంధించిన భూములు కబ్జాలకు గురయ్యాయి. బతుకమ్మ ఆడుకునేందుకు గ్రామస్తుల కోసం ఉంచిన భూమిని కొంతమంది బడా బాబులు కన్నేశారు. పక్కనే ఉన్న పట్టా భూమితో పాటు ప్రభుత్వ భూమికి సంబంధించిన దాన్ని కూడా కొంతమేర కబ్జా చేశారు. ఈ వివాదం రెవెన్యూ అధికారులకు చేరగా ఆ భూమి వద్ద బోర్డులు పాతి చేతులు దులుపుకున్నారు. అక్కడ భారీ భవనాలు నిర్మాణం అవుతుండటం పెద్దలు కూడా సహకరిస్తుండటంతో అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి బతుకమ్మ ఆడిన భూమి మాయమైన పట్టించుకునే నాధుడు లేడు. కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూమి అన్యాక్రాంతమైంది. పదుల సంఖ్యలో ఇండ్లు కూడా వెలిశాయి. యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో కేటాయించిన భూములకు, ఇప్పుడున్న భూములకు తేడా ఎక్కువగా ఉంది.
ఆ భూములు సర్వే చేపట్టిన కబ్జా అయిన భూముల వెనుక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండటంతో స్వాధీనం చేసుకోలేదు. మిగిలి ఉన్న భూమిని కబ్జా కాకుండా ఉండేందుకు యూనివర్సిటీ చుట్టూ 14 కోట్లతో గోడను కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటూ అధికారులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఆ గుడిసెలను కూలగొడుతున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారు. బడాబాబులు కబ్జా చేస్తే మాత్రం వారికున్న నేతల అండదండల వల్ల కనీసం ఆ వైపు చూడటం లేదు. పేదలపై ఉక్కుపాదం మోపే అధికారులు బడా బాబులు చేసే కబ్జాలు పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. నగరం పరిధిలోని కబ్జాలపై దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు భూమి దొరికే పరిస్థితి ఉండదు.






