- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి రైతుపై విత్తన భారం.. రూ.900కు చేరిన ప్యాకెట్ ధర
పత్తి పంటను సాగు చేసేందుకు సిద్ధమవుతున్న రైతుకు ‘విత్తనం’ షాక్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి పంటను సాగు చేసేందుకు సిద్ధమవుతున్న రైతుకు ‘విత్తనం’ షాక్ ఇచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే రూ. 50 ధర పెరిగింది. ఈ ఏడాది రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భూములను దున్ని చదును చేస్తున్నారు. అయితే వర్షాలు పడే సమయంలో విత్తనాలు తీసుకుంటే ధరలు ఎక్కువగా ఉంటాయని భావించి.. ఇప్పటి నుంచే కంపెనీల వద్దకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దళారులు కూడా క్వింటాళ్ల కొద్ది విత్తనాలు దిగుమతి చేసుకొని నిల్వలు అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే గతేడాది 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ. 850 ఉండగా.. ఈ సారి ధరను రూ. 900కు పెంచారు. ఇప్పటికే కూలీలు, దున్నడం, కలుపు తీయడం వంటి ఖర్చులతో ఇబ్బంది పడుతున్న రైతన్నకు విత్తనాల ధరల పెంపు మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.
ఎకరానికి మూడు ప్యాకెట్లు
పత్తి సాగు చేయాలంటే ఎకరానికి మూడు ప్యాకెట్టు చొప్పున విత్తనాలను నాటాల్సిందే. ఒక్క ప్యాకెట్ 475 గ్రాములు ఉండగా, అందులో 450 గ్రాములు బీటీ విత్త నాలు, 25 గ్రాములు నాన్ బీటీ విత్తనాలు ఉంటాయి. రైతులు బీటీ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. త్వరగా చేను పెరగడంతో పాటు పంట కూడా వస్తుందని భావిస్తున్నారు.
పంట చేతికి వచ్చే వరకు కష్టాలే
అన్నదాతలకు విత్తనాలు నాటినప్పటి నుంచి పత్తి చేతికొచ్చి విక్రయించే వరకు కష్టాలు తప్పడం లేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పత్తి విత్తనాల ధరలను కంపెనీలు పెంచాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరిగింది. సాగు ఖర్చులు ప్రతి ఏడాది పెరుగుతుండడంతో పత్తి సాగుకు రైతులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. అప్పులు చేసి వ్యవసాయం చేయడం కంటే కౌలుకు ఇవ్వడమే ఉత్తమమైన మార్గమని అంటున్నారు.
పెరుగుతున్న పెట్టుబడి
రైతులకు పంట సాగు చేసేందుకు ప్రతియేటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. విత్తనాలు, పురుగు మందులు, కూలీల కోసం రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. కూలీల రవాణా, కలుపు తీయడానికి ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతున్నది. వచ్చే ఆదాయానికి కంటే పెట్టుబడే అధికంగా ఉండడంతో నష్టాలను చవిచూస్తున్నామని రైతులు చెబుతున్నారు.
ప్రతియేటా పెరుగుతున్న పత్తి విత్తన ధరలు ఇలా..
సంవత్సరం - ధర
2021 - రూ.750
2022 - రూ. 800
2023 - రూ.840
2024 - రూ.850
2025 - రూ.900






