- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విత్తన చట్టం రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విత్తన చట్టం-2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విత్తన చట్టం-2025 భారత రైతాంగం శ్రేయస్సుకు బాటలు వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముసాయిదా విత్తన చట్టం-2025లో రైతుల ప్రయోజనం దృష్ట్యా చేర్చాల్సిన, మార్చాల్సిన అంశాలపై తుది నివేదిక సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను ఈనెల 11లోపు తెలపాలని కోరిందని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సెక్రెటేరియట్‌లో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. తుది నివేదిక రూపకల్పనలో చేర్చాల్సిన, మార్చాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు విత్తనోత్పత్తి కీలమని, సాంప్రదాయ, స్వదేశీ రకాలు సహా అధిక-నాణ్యత గల విత్తనాల సాగు, సంరక్షణలో వేలాది మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వారి సహకారం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ, విత్తన రైతులు తరచుగా అధికారిక గుర్తింపు లేకపోవడం, లోపభూయిష్ట ఒప్పంద నిబంధనలు, సరైన పరిహారం అందకపోవడం వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. పదేళ్ళ కాలంలో విత్తనోత్పత్తి సమస్యలతోపాటు, ముఖ్యంగా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు పండించే రైతులు నకిలీ, నాసిరకం, అనుమతి లేని, అధిక ధర కలిగిన విత్తనాల వ్యాప్తి కారణంగా నష్టాలను చవిచూశారని తెలిపారు. విత్తనచట్టం 1966 తదనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన 2004, 2010, 2019 నాటి విత్తన బిల్లు ముసాయిదాలో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడంలో ప్రభావవంతమైన చట్టాలు లేకపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలు మార్పులు చేర్పులకు సంబంధించి వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






