100% ఫలితాలే లక్ష్యం.. గురుకుల విద్యార్థుల భద్రతపై రాజీ లేదు : కార్యదర్శి విజయేందిర ఆదేశాలు

by Ramesh Naini |

ఎస్సీ గురుకులాల ఖ్యాతిని మరింతగా పెంపొందించేందుకు అందరూ కట్టుబడి పని చేయాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి విజయేందిర బోయి అధికారులకు సూచించారు.

100% ఫలితాలే లక్ష్యం.. గురుకుల విద్యార్థుల భద్రతపై రాజీ లేదు : కార్యదర్శి విజయేందిర ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్సీ గురుకులాల ఖ్యాతిని మరింతగా పెంపొందించేందుకు అందరూ కట్టుబడి పని చేయాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి విజయేందిర బోయి అధికారులకు సూచించారు. అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించేందుకు నిరంతరం కృషి చేయాలని వారికి స్పష్టం చేశారు. గురుకుల విద్యాసంస్థలు సీఎం ప్రాధాన్యతలో ఉన్నాయని అధికారులు గుర్తుంచుకోవాలని, విద్యార్థుల సంక్షేమం, రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె స్పష్టం చేశారు. బుధవారం శాఖ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా కోఆర్డినేటింగ్ అధికారులు, జోనల్ అధికారులు, మల్టీ జోనల్ అధికారులతో విజయేందిర బోయి జూమ్ ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా ప్రగతి, విద్యార్థుల సంక్షేమం, సంస్థల నిర్వహణ, పరిపాలనా ప్రమాణాలపై ఆమె అధికారులకు ముఖ్య సూచనలు జారీ చేశారు. విద్యా ప్రతిభ, విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, క్రమశిక్షణ, సంస్థల ప్రతిష్టను అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలని విజయేందిర బోయి పిలుపునిచ్చారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలని, ఎస్సెస్సీలో గుర్తించిన 3% విద్యార్థులు, ఇంటర్మీడియట్‌లో 14% స్టార్ కేటగిరీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల గోప్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఏవైనా లోపాలు బయటపడితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి సంస్థలో పరిశుభ్రత, భద్రతా ఆడిట్ ని క్రమం తప్పకుండా నిర్వహించాలని విజయేందిర బోయి ఆదేశాలు జారీ చేశారు.

ఫోన్ మిత్ర సదుపాయాన్ని వినియోగించాలి

విద్యార్థులు ఎటువంటి సంకోచం లేకుండా ఫోన్ మిత్ర సదుపాయాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహించాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో స్వేచ్ఛగా మాట్లాడుకునేలా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్నారు. ఆందోళన లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి తక్షణ సహాయం అందించాలని, నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడేందుకు లైఫ్ సేవింగ్ గ్రూపులను చురుకుగా భాగస్వామ్యం చేయాలన్నారు. పరీక్షల ముందు ఆందోళనకు గురయ్యే విద్యార్థులకు కౌన్సిలర్ల ద్వారా ప్రత్యేక సహాయం అందించాలని విజయేందిర బోయి సూచించారు.

పరిశుభ్రత కార్యక్రమం (మార్చి 6–15)

రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలన్నారు. చెత్త తొలగింపు, వ్యర్థాల నిర్వాహణ కోసం రోజువారీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని విజయేందిర బోయి తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం పర్యవేక్షణ

ప్రతి విద్యార్థికి వ్యక్తిగత ఆరోగ్య కార్డు ప్రవేశపెట్టాలని, వేసవి ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి నెలలో సమగ్ర ఆరోగ్య పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. నిర్ణయించిన పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా కామన్ డైట్ మెనూను కచ్చితంగా అమలు చేయాలని, ఆహార నాణ్యత మరియు పరిమాణం విషయంలో రాజీ ఉండకూడదన్నారు. ఆహార నిల్వ విధానాలు ఎస్వోపీల ప్రకారం ఉండాలని, ఆహారంపై విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి సమీక్షించాలని విజయేందిర బోయి సూచించారు. ఎటువంటి తేడాలు వచ్చినా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

సంస్థల తనిఖీలు

డీసీఓలు, జెడ్వోలు, ఎంజెడ్వోలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, తనిఖీ నివేదికలను సమగ్రంగా సమీక్షించి అమలు చర్యలు చేపట్టాలని విజయేందిర బోయి అన్నారు. ఆహార కలుషితాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతికూల మీడియా వార్తలు రాకుండా పారదర్శకత మరియు బాధ్యతాయుత వ్యవహారం పాటించాలని ఆమె తెలిపారు.

Next Story