- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్రటరీలు Vs మంత్రులు..! సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన పంచాయితీ
రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల సెక్రెటరీలకు పొసగడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల సెక్రెటరీలకు పొసగడం లేదు. మంత్రి ఒకటి చెప్తే.. సెక్రెటరీలు మరొకటి చేస్తున్నారు. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే.. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నందున నిర్ణయాలు తీసుకోలేమని తెగేసి చెబుతున్నారు. అన్ని విషయాల్లో అదే తీరుగా ఉండటం లేదని, తమకు ఇష్టమైన వారి ఫైల్స్ విషయంలో మాత్రం రూల్స్ పక్కన పెట్టిన ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతో ఇరువురి మధ్య విబేధాలు తలెత్తి చివరికి సెక్రెటరీలనే మార్చాలని మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది.
ముందు ఎస్.. తర్వాత నో..
చాలా మంది వివిధ సమస్యలపై మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మినిస్టర్లు తమ శాఖ సెక్రెటరీలకు రికమెండ్ చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు ఉంటే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటమో లేక తమ చాంబర్‌కు పిలిచి చెప్పడమో చేస్తుంటారు. మంత్రులు చెప్పినప్పుడు సరే అంటూ తల ఊపుతున్న సెక్రెటరీలు తర్వాత సంబంధిత ప్రపోజల్‌పై నెగిటివ్‌గా రాయడమో లేక కొర్రీలు పెట్టడమో వంటివి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక వేళ రూల్స్‌కు విరుద్ధంగా ప్రపోజల్స్ ఉంటే సమయం, సందర్భం చూసుకుని మంత్రులకు వివరించాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ సెక్రెటరీలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.
సమన్వయం లోపంతో సమస్యలు
మంత్రులు, సెక్రెటరీల మధ్య విభేదాలు, మనస్పర్థాలు రావడానికి ఇరువురు మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలుస్తున్నది. మంత్రి ఓ రకంగా ఆలోచిస్తుంటే, సెక్రెటరీలు మరో రకంగా వ్యవహరించడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఐఏఎస్‌లు విధాన పరమైన అంశాల్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి? బాధితులకు ఏ రకంగా న్యాయం చేయొచ్చు? అనే అంశాలపై మంత్రులకు రూల్స్ వివరించాలి. మంత్రులు సైతం ఐఏఎస్‌లు ఇచ్చే సలహాలు పాటించాలి. ఒక వేళ సదరు అధికారి తప్పుగా గైడ్ చేస్తున్నారని డౌట్ వస్తే తమకు సన్నిహితంగా ఉండే ఆధికారుల ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడే ఇరువురు మధ్య సహకారం, సమన్వయం ఉంటుంది.
రిజ్వీ ఎపిసోడ్‌తో బయటికి..
ఈ మధ్య ఐఏఎస్ అధికారి రిజ్వీ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య జరిగిన ఎపిసోడ్ పెద్ద సంచలంగా మారింది. తనకు తెలీకుండానే శాఖ సెక్రెటరీ పలు నిర్ణయాలు తీసుకున్నారని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని మంత్రి స్వయంగా చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన రిజ్వీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అనుమతి ఇవ్వొద్దని లేఖలో పేర్కొన్నారు. కానీ అప్పటికే ప్రభుత్వం ఆయన అప్లై చేసిన వీఆర్ఎస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ సమయంలోనే చాలా మంది మంత్రులు, తమ శాఖల సెక్రెటరీల పనితీరుపై సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐఏఎస్‌లు రూల్స్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కొత్త వారిని అపాయింట్ చేయాలని అప్పీల్
మెజార్టీ మంత్రులు తమ వద్ద పని చేస్తున్న ఐఏఎస్‌లను మార్చి కొత్త వారిని అపాయింట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి అప్పీల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొందరు సీనియర్ మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు మొహమాటం అడ్డురావడంతో సీఎస్‌కు, సీఎంవో సెక్రెటరీకి చెబుతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉంది. అందులో పాలన అనుభవం ఉన్న ఆఫీసర్లు కొందరే ఉన్నారు. ఇందులో ఎవరిని మార్చాలి? ఎవరిని కొనసాగించాలి? అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే కొందరు స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రెటరీల విషయంలో కాంగ్రెస్ లీడర్లకు అభ్యంతరాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో సన్నిహితంగా ఉన్నారనే విమర్శలున్నాయి. అందుకే అనుభవం ఉన్న ఐఏఎస్‌లను పక్కన పెట్టారని టాక్ ఉంది.
– ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రికి ఆ శాఖ సెక్రెటరీకి మధ్య పొసగడం లేదు. మంత్రి పంపిన ప్రపోజల్‌ను వెంటనే క్లియర్ చేయడం లేదు. ఫోన్ చేసి అడిగితే ఇదిగో.. అదిగో అంటూ రోజులు గడుపుతున్నారు. దీంతో ఆ సెక్రెటరీని ట్రాన్స్‌ఫర్ చేస్తే బాగుండు అని ఆ మంత్రి తన సన్నిహితుల వద్ద కామెంట్ చేస్తున్నారు.
– ఓ మంత్రికి మూడు తరాల సీఎంలతో పని చేసిన అనుభవం ఉంది. పాలనావిషయాల్లోనూ ఆయనకు మంచి పట్టుంది. అలాంటి మంత్రి తన శాఖ సెక్రెటరీలు నెగిటివ్‌గా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ముందు సరే అంటూ తలూపే అధికారులు తర్వాత పైల్స్ క్లియరెన్స్‌పై కొర్రీలు పెడుతున్నారు. దీంతో ఆ మంత్రి తనదైన శైలీలో వ్యవహరించడం పరిపాటిగా మారిందని, గతంలో ఓ ఐఏఎస్ ఆయన ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి మరో చోటకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ప్రచారంలో ఉంది.
– ప్రతి శాఖలో మంత్రి నిర్ణయమే పైనల్. కానీ ఓ శాఖ సెక్రెటరీ మాత్రం మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫైల్స్‌పై నెగిటివ్ రాసి చీఫ్ సెక్రెటరీ ఆమోదం కోసం పంపారు. అలాగే ఆ శాఖ హెచ్ఓడీ సైతం మంత్రి పంపిన 100 డిప్యూటేషన్ల రికమెండేషన్లను పక్కన పెట్టారు. కానీ తనకు కావాల్సిన వ్యక్తులకు మాత్రం సదరు సెక్రెటరీ డిప్యూటేషన్లకు అనుమతివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
– ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్‌గా పని చేసిన అనుభవం, హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న ఓ మంత్రి పంపే ఫైల్స్‌ను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ చూడటం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఆ బాధ్యతలను ఓ జూనియర్ ఐఏఎస్‌కు అప్పగించారు. ఆయన ఇదే అదునుగా భావించి శాఖలోని అధికారుల ప్రమోషన్ల టైంలో పెద్ద ఎత్తున దండుకున్నట్లు టాక్ ఉంది.
– మంత్రులతో రివ్యూలు ఉంటే సెక్రెటరీలు ఓ గంటో లేక అరగంటో ముందుగా వచ్చి సంబంధిత సబ్జెక్ట్ పై ఇతర అధికారులతో ప్రిపేర్ అవుతుంటారు. కానీ ఓ సెక్రెటరీ మాత్రం మంత్రి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారా? లేదా? అనేది తెలుసుకుని ఆ తర్వాతే తాను ఇంటి నుంచి సెక్రెటేరియట్‌కు బయలు దేరుతారని విమర్శ ఉంది. కొన్ని సార్లు మంత్రి వచ్చిన తర్వాత ఆయన వస్తుంటారని ప్రచారంలో ఉంది.
– ఈ మధ్య జరిగిన బదిలీల్లో ఓ ఐఏఎస్ కీలకమైన శాఖ నుంచి మరో శాఖకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో మంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ఇంటికెళ్లి మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉంది. కానీ ఆ ఆఫీసర్ ఇప్పటి వరకూ సంబంధిత మంత్రిని కలవలేదు. సెక్రెటేరియట్‌లో మాత్రమే కలుస్తానని అన్నట్లు తెలిసింది.
– మున్సిపల్ శాఖలోని ఓ అధికారి తీరుపై చాలా మంది ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రికు ఫిర్యాదు చేశారు. తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని, సదరు ఆఫీసర్‌ను అక్కడి నుంచి బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం.






