Second Phase Sarpanc Election: రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. డబ్బుల పంపిణీకి టీంల ఏర్పాటు

by Prasad Jukanti |

ఓటు కోసం అభ్యర్థులు ఒట్లేయించుకుంటున్నారు.

Second Phase Sarpanc Election: రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. డబ్బుల పంపిణీకి టీంల ఏర్పాటు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పొద్దున్నే ఇంటింటికీ టిఫిన్‌.. మధ్యాహ్నం చికెన్‌.. పోటాపోటీ నెలకొన్న గ్రామాల్లో పొట్టేలు మాంసం.. రాత్రికి క్వార్టర్‌ బాటిల్‌.. ఇదీ ఉమ్మడి జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) రెండు విడతలకు (Second Phase Elections) సంబంధించి ఆయా గ్రామాల్లో ప్రచారం జోరందుకున్నది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ మద్దతు కూడగడుతున్నారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు అభ్యుర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. అభ్యర్థులపై ఎఫెక్ట్‌తో అదనపు భారం పడింది. పోటాపోటీ నెలకొన్న కొన్ని మేజర్‌ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు ఇంటింటికి మాంసం పంపిణీ చేశారు. ఇంకొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం చికెన్‌ రైస్‌, చికెన్‌ బిర్యానీ, రాత్రికి మందు దావత్‌లు ఇచ్చారు. రోజంతా దావత్‌ల జోష్‌తో పల్లెల్లో ఎక్కడ చూసినా ఓట్ల పండుగ నెలకొన్నది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో అభ్యర్థులు విచ్చల విడిగా ప్రలోభాలకు తెరలేపారు. గెలుపు కోసం శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు డబ్బులు పంపిణీ చేస్తూ ఒట్టేయించుకుంటున్నారు. మద్యం బాటిళ్లు, చికెన్, మటన్ పార్శిల్ ఇంటింటికీ సప్లయ్ చేస్తున్నారు. డోర్ టూ డోర్ ప్రచారంతో పాటు మొబైల్ ఫోన్లలో వాయిస్ మెసేజ్ ల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థుల ప్రచార శైలిని ఎప్పటి కప్పుడు గమనిస్తూ వారికి ధీటుగా ఓట్లు రాబట్టుకునేందుకు ప్రత్యర్థులకు మద్ధతుగా ఉన్న ఓటర్లను తమ వైపు లాగేసుకునేందుకు అవసరాన్ని బట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు తమకే వేయాలంటూ దేవుడిపైనా, వారి కుటుంబ సభ్యులపైన ఒట్‌లేయించుకుంటున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు.

గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా ప్రచారం..

తమ అనుచరులతో ఎప్పటి కప్పుడు గ్రౌండ్ రిపోర్టు ఎలా ఉందో, ఓటర్ల మదిలో ఏముందోననే విషయాలను తెలుసుకుంటున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రత్యేకంగా పలు మార్లు కలిసి ఓట్లేయాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ ఇంటినీ, ఓ మనిషినీ వదలకుండా అభ్యర్థులు ఓట్లడుగుతున్నారు. డబ్బుల పంపిణీలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తమ అనుచరుల ఫోన్ పే నుంచే ఓటర్లకు డబ్బులు పంపుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు తమ ఫోన్ పే ద్వారా డబ్బులు పంపకుండా జాగ్‌రత్త పడుతున్నారు. తమ అనుచరుల వద్దే మద్యం స్టాక్, డబ్బులు, ఇతర ప్రలోభవస్తువులు డంప్ చేస్తూ అక్కడి నుంచే పంపిణీ చేస్తున్నారు.

సంఘాల వారీగా తాయిలాలు..

వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు, కుల సంఘాల వారీగా కూడా కలుస్తూ వారికి తాయిలాలు సమర్పిస్తున్నారు. కుల సంఘాల కోరికల చిట్టాను ప్రశాంతంగా వింటూ అప్పటి కప్పుడు తీర్చగలిగే కోరికలను వెనువెంటనే తీర్చేస్తూ, ఇన్ స్టంట్ తీర్చలేని కోరికలపై హామీ ఇస్తున్నారు. గెలవగానే వారి డిమాండ్లను నెరవేరుస్తామంటూ బాండ్ రాసి ఇస్తున్నారు. కొన్ని కులసంఘాలు మాత్రం గెలుపుతో సంబంధం లేకుండా మా పనులు చేస్తామంటే తప్ప ఓట్లయబోమని కరాఖండిగా చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో కష్టమైనా వారి కోరికలు తీర్చే పనిలో పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరి మద్ధతు తమకే ఉండాలని రాయించుకుంటున్నారు. కొన్ని సంఘాలకు సొంత భవనాల నిర్మాణాలకు నిధులు కావాలని అడిగి, వెంటనే రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు తీసుకుంటున్నారు. కొన్ని సంఘాలు మాత్రం తమకు భవన నిర్మాణాల కోసం స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ మాట తీసుకుంటున్నారు.

ఓటు మాత్రం మాకే వేయండి

మీ ఓటు మాకు ఎంతో విలువైందని, ఓటుకు రూ.3వేలైనా ఇస్తాం, అవసరమైతే అదనంగా మరికొంత ఇస్తాం కానీ, మీ ఓటు మాత్రం మాకే వేయడంటూ ధర్పల్లి, జక్రాన్ పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల కోసం తంటాలు పడుతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఓ సర్పంచ్ అభ్యర్థి తను వేసుకున్న అంచనాకు మించి ఖర్చవుతుండటంతో తన ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి రూ. 40 లక్షలు అప్పు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నట్లు తన అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చాలా చోట్ల ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకుని ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు రాబట్టుకునేందుకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story