- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాలెట్‌కు చెక్.. స్థానిక పోరుకు ఈవీఎం కసరత్తు
స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. తొలిసారి బ్యాలెట్ ను పక్కనపెట్టి ఎలక్ట్రిక్ యంత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నది. తొలిసారిగా ఎలక్ర్టానిక్ యంత్రాల ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసింది.
ఒక యంత్రం.. రెండు ఓట్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకేసారి ఓటు వేసే విధంగా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కొత్త తరహా కంట్రోల్ యూనిట్లను తయారు చేసింది. వీటిని ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవంతంగా ఉపయోగించింది. ఈ విధానంపై ఎలాంటి విమర్శలు రాకపోగా.. పార్టీలు సైతం అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఈ తరహాలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకేసారి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే.. ఒక్కో ఎన్నికకు ఒక కంట్రోల్ యూనిట్ అవసరమయ్యేది. అంత పెద్ద సంఖ్యలో ఎస్ఈసీ వద్ద ఈవీఎంలు అందుబాటులో లేవు. దీంతో బ్యాలెట్ పేపర్, బాక్సు విధానాన్నే అనుసరించారు. కానీ ఈసీఐఎల్ కొత్త తరహా టెక్నాలజీతో ఒకటే కంట్రోల్ యూనిట్‌కు రెండు బ్యాలెట్ యూనిట్లను అటాచ్ చేయవచ్చు. కంట్రోల్ యూనిట్‌లో డిటాచెబుల్ మెమొరీ మాడ్యూల్‌ను ఉంచుతారు. దీనిని పోలింగ్ పూర్తయ్యాక భద్రపరిచి.. ఎన్నికల కౌంటింగ్ సమయంలో మళ్లీ తీసుకువచ్చి ఓట్లను లెక్కిస్తారు. ఆ విధంగా ఈసీఐఎల్ సాఫ్ట్‌వేర్ రూపొందించింది.
చెల్లని ఓట్లకు పరిష్కారం
రాష్ట్రంలో ఇలాంటి ఈవీఎంలు 17 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. గతంలోనే వీటిని రాష్ట్ర అవసరాల కోసం తయారు చేసినా.. ఇప్పటివరకు వినియోగించలేదు. వీటిని వినియోగించడం ద్వారా పెద్దఎత్తున బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ భారం తగ్గుతుంది. ఓట్ల లెక్కింపు సైతం వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల చెల్లని ఓట్లతోనే గెలుపోటములు తారుమారవుతుంటాయి. కానీ.. ఈవీఎంలతో అలాంటి వాటికి ఆస్కారం లేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈవీఎంలే మెరుగు అని ఎన్నికల సంఘం అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
కేరళ మోడల్ అధ్యయనానికి బృందం
ఈ తరహా విధానాన్ని కేరళలో ఏ విధంగా అమలు చేశారనే దానిపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, కొందరు జిల్లాస్థాయి ఆఫీసర్లు అక్కడికి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో 5,700పైగా వరకు ఎంపీటీసీ, 570 వరకు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిని కలిసి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈవీఎంలు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సరిపోకుంటే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకొని పూర్తిస్థాయిలో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.






