- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FCRI: అంతరించిపోయే పొనికి చెట్టుకు శాస్త్రీయ ప్రోత్సాహం..! నిర్మల్ కళలకు కొత్త ఊపు
ములుగు అటవీ కళాశాల (FCRI) శాస్త్రవేత్తలు అరుదైన ‘పొనికి’ చెట్టు (Givotia rottleriformis) కోసం విప్లవాత్మక మొలకెత్తింపు పద్ధతిని అభివృద్ధి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ములుగు అటవీ కళాశాల (FCRI) శాస్త్రవేత్తలు అరుదైన ‘పొనికి’ చెట్టు (Givotia rottleriformis) కోసం విప్లవాత్మక మొలకెత్తింపు పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ కొత్త పద్దతితో 75 నుంచి 80 శాతం వరకు విత్తనాల మొలకెత్తింపు సాధ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ చెట్టు విత్తనాలు సహజ పునరుత్పత్తి లోపం, నివాస ప్రదేశాల క్షీణత కారణంగా తీవ్రంగా తగ్గిపోయింది. దీని వల్ల నిర్మల్ బొమ్మలు, హస్తకళల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల కొరత ఏర్పడింది. శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త పద్ధతి ద్వారా పొనికి చెట్ల సంఖ్య తిరిగి పెరుగుతుందని, దీతో పాటు నిర్మల్ కళాకారుల కుటుంబాలకు ఆర్థిక బలమైన అండ లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈ పరిశోధన తెలంగాణకు GI ట్యాగ్ పొందిన నిర్మల్ కళా వారసత్వాన్ని కాపాడటంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తోంది.
ఇకపై ఈ కొత్త పద్ధతి ఆధారంగా పెద్ద ఎత్తున పొనికి మొక్కల నాట్లు, పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు సంస్కృతి, జీవనాధారాలను సమన్వయపరుస్తూ తెలంగాణ వారసత్వాన్ని రక్షించబోతోందని పరిశోధకులు తెలిపారు. కాగా, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి పొనికి చెట్టు కలపను ఉపయోగిస్తారు. బొమ్మల తయారీకి ప్రాణం పోసే చెట్టుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో ఈ చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు వీటిని ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు మొలకెత్తింపు పద్ధతిని అభివృద్ధి చేయడంతో నిర్మల్ కళలకు కొత్త ఊపు లభించబోతుందని నిపుణులు చెబుతున్నారు. ట్వీట్..






