20 రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-11-12 12:10:51  IST  )

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఖర్చులు కాంట్రాక్టర్లదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

20 రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. నీరు తగ్గిన వెంటనే 15-20 రోజుల్లో పునరుద్ధరణ కోసం అవసరమైన పరీక్షలు మొదలు పెడతామని వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల పునరుద్ధరణ పనుల పురోగతిని అంచనా వేయడానికి కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి)తో సమన్వయంపై మంత్రి ఉ్తతమ్ ఇవాళ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్ఎస్ పర్యవేక్షణలో బ్యారేజీల పునరుద్ధరణ చేపడతామని, విజిలెన్స్, న్యాయకమిషన్ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. డిజైన్, క్వాలిటీ లోపాలపై నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. పరీక్షలు పూర్తయ్యాక సీడబ్ల్యూసీ ఆమోదంతో పనులు మొదలు పెడతామన్నారు. బ్యారేజీల మరమ్మతు ఖర్చు కాంట్రాక్టర్లదేనని ఈ సందర్భంగా ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజల డబ్బు ఉందని ప్రతి ప్రాజెక్టులో పారదర్శకత సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజకీయ, ఇంజినీరింగ్ స్థాయిలో జరిగిన తప్పిదాల వల్లే కాళేశ్వరంలో నష్టం జరిగిదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సమ్మక్క సారక్క ప్రాజెక్ట్, సీతమ్మసాగర్, సీతారామసాగర్, మోదికుంట వాగు, చనక-కొరట, చిన్న కాళేశ్వరం వంటి పలు ప్రాజెక్టుల పురోగతిని కూడా ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. CWC టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదాలు త్వరితగతిన పొందాలని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో NOC పై సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story