ఫీజు నియంత్రణ బిల్లుపై మాఫియా పంజా: చట్టం రాకుండా తెర వెనుక చక్రం!

by Naga Rani Yarlagadda |

ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లకు చెక్ పెట్టేందుకు ఫీజు నియంత్రణ బిల్లును తీసుకు రానుంది ప్రభుత్వం.

ఫీజు నియంత్రణ బిల్లుపై మాఫియా పంజా: చట్టం రాకుండా తెర వెనుక చక్రం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఫీజు నియంత్రణ బిల్లు’ను పురిట్లోనే చంపేందుకు ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు రంగంలోకి దిగాయి. బిల్లును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగా రూలింగ్ పార్టీలోని పలువురు కీలక నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీనితో డ్రాప్ట్ బిల్లు బయటకు రాకుండా సెక్రెటేరియట్‌లోని పలు డిపార్ట్‌మెంట్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది. ప్రయివేటు సూళ్లలో కొనసాగుతున్న ఫీజుల దందాకు చట్టపరంగా చెక్ పెట్టేందుకు ‘ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆ కమిషన్ ఏర్పాటైతే తమ ఆగడాలకు అడ్డుకట్టపడుతుందని భావించిన ప్రయివేటు స్కూల్స్ మాఫియా వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

లీడర్ల సపోర్టు..

రాష్ట్రంలో ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. సదుపాయాలు, ట్రైన్డ్ టీచర్లతో సంబంధం లేకుండా ప్రతిఏటా రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. పలు నెట్ వర్క్ విద్యాసంస్థలు ఒక మాఫియాగా ఏర్పడి ఇష్టానుసారంగా ప్రతిఏటా ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి. మిగతా విద్యా సంస్థలు సైతం అదే తరహాలో ఫీజులను వసూలు చేస్తున్నాయి. దీనితో తల్లిదండ్రులు పలుసార్లు ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా చట్టం ఉండాలని భావించి బిల్లును తయారు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు డ్రాప్ట్ బిల్లును తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ లీడర్ల సహకారంతో మాఫియా రంగంలోకి దిగింది. డ్రాప్ట్ బిల్లు కేబినెట్ ముందుకు వెళ్లకుండా తీవ్రంగా ఒత్తిడి పెంచినట్టు ప్రచారం జరుగుతోంది.

3 నెలలుగా శాఖల చుట్టూ చక్కర్లు..

ఈమధ్య జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రయివేటు స్కూల్స్ ఫీజు నియంత్రణ బిల్లు అసెంబ్లీకి ముందుకు వస్తుందని చర్చ జరిగింది. కానీ లాబీయింగ్ కారణంగా ఆ డ్రాఫ్ట్ బిల్లు వివిధ శాఖల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది. విద్యాశాఖ రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లును కొన్ని రోజులు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించగా, ఇంకొన్ని రోజులు న్యాయశాఖ సలహాలు, సూచనలకు పంపడంతో అక్కడ కొంత కాలం ఆలస్యమైందని చర్చ జరుగుతున్నది. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో డ్రాఫ్ట్ బిల్లు మూలకు పడిపోయింది. సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా సదరు బిల్లును చట్టంగా మార్చే అవకాశం ఉంది. కానీ, ప్రయివేటు స్కూల్స్ మాఫియా ఒత్తిడితో ప్రభుత్వం మౌనంగా ఉంటుందా? లేక ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఆర్డినెన్స్ తెస్తుందా? అనే చర్చ జరుగుతున్నది.

చట్టం వస్తే ఫీజుల దందాకు చెక్

చట్టం అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో ప్రయివేటు స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేయలేవు. ప్రతిఏటా ఫీజు నిర్ధారించే అధికారం కేవలం కమిషన్‌కు మాత్రమే ఉంటుంది. అందుకోసం ప్రతి స్కూల్ యాజమాన్యం పిల్లలకు అందిస్తోన్న సదుపాయాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖర్చుల వివరాలను కమిషన్‌కు సమర్పించాలి. ఆ వివరాలను పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే సంబంధిత స్కూల్ ఎంత ఫీజు వసూలు చేయవచ్చో కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల తమ ఆగడాలకు చెక్ పడుతుందని అంచనాకు వచ్చిన ప్రయివేటు స్కూల్స్ మాఫియా రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. రూలింగ్ పార్టీలోని నేతల ద్వారా డ్రాఫ్ట్ బిల్లును బయటకు రాకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story