రహమత్ నగర్‌లో దళిత మహిళపై అత్యాచారం బాధకరం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రహమత్ నగర్‌లో దళిత మహిళ పై అత్యాచారం జరగడం బాధకరమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

రహమత్ నగర్‌లో దళిత మహిళపై అత్యాచారం బాధకరం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో (Dalit woman) దళిత మహిళ పై అత్యాచారం (Rape) జరగడం బాధకరమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati Rathod)​ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలపై నేరాలు పెరుగుతున్నా హోమ్ మంత్రిగా రేవంత్​ రెడ్డి సరైన సమీక్షలు చేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ లో చెత్త సేకరణ కూడా సరిగా లేదని ఈ మధ్యే అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆయన నిర్వహిస్తున్న ఏ శాఖలు పని చేయడం లేదన్నారు. అధికార పార్టీ కి పోలీసులు అడుగులకు మడుగులు ఒత్తడం తోనే నేరాలు పెరిగిపోతున్నాయని, మహిళా మంత్రులకు మహిళలపై జరుగుతున్న నేరాలు పట్టవని వారికి సంపాదనపై శ్రద్ధ పెరిగిందన్నారు. మహిళా ఐపీఎస్​ అధికారులు కూడా సరిగా పని చేయడం లేదని, వారి మీద మంత్రుల ప్రవర్తన సరిగ్గా లేదని ఆరోపించారు. ఇక సామాన్య మహిళల పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందో అర్థమైతుందన్నారు. మహిళలను కోటీశ్వరులు తర్వాత చేయాలని ముందు వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఫ్రీ బస్సు పేరిట ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుతున్నారని, మగవారికి బస్సు చార్జీలు ఎందుకు పెంచారు..? సమాధానం చెప్పాలన్నారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేశారు. అజారుద్దీన్ అభ్యర్థిగా ఉన్నపుడే పడని ఓట్లు ఆయన మంత్రి ఉండగా చెబితే ఏవిధంగా పడుతాయని, ఆయనకు పదవి ఇవ్వడంతో సామాన్య ముస్లింలకు ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో జీహెచ్​ఎంసీ మహిళా కార్మికుల గౌరవం పెంచారని, రేవంత్ పాలనలో మహిళా కార్మికురాలి ఫై అత్యాచారం జరిగిందన్నారు. కేసీఆర్ తండ్రి మనసుతో అందరిని కాపాడుకున్నారని, రాష్ట్రంలో మూర్ఖుడు, దుర్మార్గుడి పాలన నడుస్తోందని మండిపడ్డారు.హైదరాబాద్ ప్రతిష్ట దిగజారేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తించవద్దని, మహిళలపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story