సంక్రాంతి రద్దీలో దండయాత్ర.. 75 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ కేసులు

by Ramesh Naini |

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రైవేటు బస్సులపై దండయాత్ర చేపట్టింది.

సంక్రాంతి రద్దీలో దండయాత్ర.. 75 ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రైవేటు బస్సులపై దండయాత్ర చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జనవరి 7 నుంచి నేటి వరకు 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో లేకపోవడం వంటి వివిధ ఉల్లంఘనలపై ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యేకంగా 8 బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే..

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ఛార్జీలు వసూలు చేయరాదని రవాణా శాఖ హెచ్చరించింది. అలాగే స్టేజ్ క్యారేజ్‌గా బస్సులను నడపకూడదని స్పష్టం చేసింది. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో నమోదు అయి తెలంగాణలో తిరుగుతున్న స్లీపర్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ స్పష్టం చేసింది.

Next Story