సంధ్య థియేటర్ కేసు: విచారణకు హాజరైన అల్లు అర్జున్

by Gantepaka Srikanth |

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో జరిగింది.

సంధ్య థియేటర్ కేసు: విచారణకు హాజరైన అల్లు అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో జరిగింది. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న కారణంగా, అల్లు అర్జున్ ఈ విచారణకు కోర్టు అనుమతితో వర్చువల్ (ఆన్లైన్)గా హాజరయ్యారు. గత వాయిదా సమయంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరగా, న్యాయస్థానం నేడు ఆయనను వర్చువల్‌గా విచారణలో పాల్గొనేందుకు అనుమతించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌కు సంబంధించి కీలక ప్రక్రియ నేడు పూర్తయింది. ఈ కేసులో అల్లు అర్జున్ (ఏ11)తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) నిందితులందరికీ దాదాపు 500 పేజీల భారీ ఛార్జిషీట్ నకళ్లను (కాపీలను) అధికారికంగా అందజేశారు.

విచారణ వాయిదా..

ఛార్జీషీట్ కాపీల పంపిణీ అనంతరం న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి (జూలై 29) వాయిదా వేసింది. 2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో 'పుష్ప - 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.

Next Story