విత్తన బ్యాగులు ఇస్తారు.. కాలాన్ని తిరిగి ఇస్తారా..!

by Batti.Sumithra |

తేజస్వి కంపెనీ సోయా విత్తనాలను విత్తి నష్టపోయామని వస్తే విత్తన బ్యాగులు ఇస్తామంటున్నారు.

విత్తన బ్యాగులు ఇస్తారు.. కాలాన్ని తిరిగి ఇస్తారా..!
X

దిశ, భైంసా : తేజస్వి కంపెనీ సోయా విత్తనాలను విత్తి నష్టపోయామని వస్తే విత్తన బ్యాగులు ఇస్తామంటున్నారు. కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి ఇస్తారా.. అంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న చెట్టెక్కి నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చొండి గ్రామానికి చెందిన దాసరి రాజలింగం అనే రైతు తన పొలంలో విత్తేందుకు భైంసాలోని ఓ ఎరువుల దుకాణంలో తేజస్వి కంపెనీకి చెందిన తొమ్మిది బ్యాగుల సోయా విత్తనాలను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వాటిని పొలంలో విత్తిన అనంతరం తొమ్మిదిలో ఏడు బ్యాగుల విత్తనాలు సరిగా మొలకెత్తలేదని, దీంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విషయమై పలుమార్లు ఎరువుల దుకాణాన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీనికి నిరసనగా దుకాణం సమీపంలోని చెట్టుపైకి ఎక్కి ఆందోళనకు దిగాడు. అదే విధంగా తేజస్వి సోయా విత్తనాలను విత్తి నష్టపోయిన పలువురు రైతులు కూడా అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైతును చెట్టు దిగాలని కోరారు. అయితే తనకు తగిన న్యాయం చేస్తామని అధికారుల నుంచి హామీ లభిస్తేనే దిగుతానని రైతు రాజలింగం స్పష్టం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతుకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story