Sandhya Theater stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ డిశ్చార్జ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-29 16:02:04  IST  )

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.

Sandhya Theater stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ డిశ్చార్జ్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 (Pushpa-2) మూవీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ (Sandya Theater) వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ (Sreeteja) తొక్కిసలాటలో గాయపడ్డారు. ఇన్ని రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌ (KIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్.. మంగళవారం రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం. శ్రీతేజ్‌కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యం కొనసాగింది.

శ్రీతేజ్ తండ్రి మాట్లాడుతూ.. శ్రీతేజ్ చికిత్స విషయంలో పుష్ప- 2 చిత్రం యాజమాన్యం, సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రభుత్వం నుంచి తమకు బాగా మద్దతు లభించిందని తెలిపారు. ఇప్పటికీ తమని వైద్యులు, కిమ్స్‌ యాజమాన్యం డబ్బులు అడగలేదని చెప్పారు. డిశ్చార్జి సమయంలో కూడా బలవంతం చేయలేదన్నారు. శ్రీతేజ్‌ చెల్లెలు అమ్మ ఏది? అని అడుగుతోందని, ఊరెళ్లిందని చెబుతున్నట్లు తెలిపారు. తమకు సపోర్టు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో ఆయన ఓ రోజు రాత్రి మొత్తం చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్లు అర్జున్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాననని హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి ఇప్పటికే దాదాపు 5 నెలలు గడిచిపోవటంతో చాలా మంది ఈ ఘటనను మర్చిపోయారు కూడా. ఇక తాజాగా బాలుడు కోలుకోవటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

Next Story