కాంగ్రెస్ ​ప్రభుత్వం రాగానే ఇసుక ఆదాయం పెరిగింది: TGMDC చైర్మన్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-30 15:28:46  IST  )

రాష్ట్రంలో ఇసుకు అక్రమ రవాణా జరగకుండా అరికట్టడంతో పాటు సామాన్యులకు సులువుగా దొరికేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్ధ చైర్మన్ ​ఈరవత్రి అనిల్​కుమార్​ తెలిపారు.

కాంగ్రెస్ ​ప్రభుత్వం రాగానే ఇసుక ఆదాయం పెరిగింది: TGMDC చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇసుకు అక్రమ రవాణా జరగకుండా అరికట్టడంతో పాటు సామాన్యులకు సులువుగా దొరికేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్ధ చైర్మన్ ​ఈరవత్రి అనిల్​కుమార్​ తెలిపారు. బుధవారం ఖైరతాబాద్ లోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం సూచించిన ధరలకే అమ్మకాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48 రీచ్​ల నుంచి ఇసుక తరలిస్తున్నామని, ఇసుక కావాల్సిన వారికి డోర్​డెలివరీ సౌకర్యం కల్పించామని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు 2025, ఫిబ్రవరి నుంచి ఇసుక విషయంలో చోటు చేసుకుంటున్న అక్రమాలను నిరోధించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. ఇసుక రీచుల నుంచి స్టాక్‌యార్డుకు చేరుకునే వాహనాలకు జీపిఎస్​పరికరాలు, ఇసుక రీచుల వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు. దీంతో ప్రభుత్వానికి ఇసుకు ఆదాయం పెరిగిందని, గత ప్రభుత్వంలో ఏటా రూ. 678 కోట్లు రాగా, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాదిలో రూ. 745 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. రియల్​ రంగం రోజు రోజుకు పుంజుకుంటుందని అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం రూ. 1200 కోట్లు టార్గెట్ ​పెట్టుకుందని తెలిపారు.

ప్రస్తుతం ఇసుక బజార్లు నాలుగు చోట్ల ప్రారంభించామని, మరో రెండు చోట్ల త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సన్న ఇసుక ధర రూ. 1800, దొడ్డు ఇసుక రూ. 1600లు నిర్ణయించినట్లు చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ ఇసుక తవ్వకాలు పాటు వేబిల్స్ లేని వాహనాలను నియంత్రించే ఉద్దేశంతో సాండ్ బజార్స్ కు శ్రీకారం చుట్టమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఒక వారంలోనే సన్న ఇసుక ధర రూ.1900 నుంచి 1800, దొడ్డు ఇసుక ధర రూ.1700 నుంచి రూ. 1600 వరకు దిగి వచ్చిందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి సాండ్ బజార్స్, స్టాక్‌యార్డ్స్ నుంచి ప్రజలకు ఇంటి వద్దకే ఇసుకను చేర్చే ఒక వ్యవస్థను కూడా రూపొందించాలని ఆదేశించారు.

దానికి అనుగుణంగా తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థ "https://sand.telangana.gov.in/ TGSandBazaarPortal/Masters/Home.aspx" అనే ఆన్‌లైన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఇసుకను హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుడు తాను ఎంపిక చేసిన ఇసుక రీచ్ నుంచి ఇసుక ధర రూ.400 తో పాటు ప్రతి టన్ను, ప్రతి కిలోమీటరుకు నిర్ణయించిన మేరకు రవాణా చార్జీలు చెల్లించాలి. ఇందుకోసం 1600 వాహనాలు సిద్ధం ఉంటాయి. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే ప్రతి కిలోమీటర్ కు రూ.3.75 చొప్పున, 200 కి మీ కంటే తక్కువ దూరం ఉంటే ప్రతి కిలోమీటర్ కు రూ.4.25 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తామని వివరించారు.

Next Story