పదే పదే అడ్డుకుంటున్న అధికారులు.. వ్యూహాత్మకంగా చెక్ పెట్టిన ఎమ్మెల్యే!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-31 03:05:35  IST  )

ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ మంత్రి, నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరూ కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్లినట్లు చర్చ జరుగుతున్నది.

పదే పదే అడ్డుకుంటున్న అధికారులు.. వ్యూహాత్మకంగా చెక్ పెట్టిన ఎమ్మెల్యే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సహజంగా అధికార, ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టుసాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ మంత్రి, నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరూ కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్లినట్లు చర్చ జరుగుతున్నది. వ్యాపారం చేస్తే తప్పు లేదు కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లినట్లు తెలుస్తున్నది.

ఇద్దరి టార్గెట్ ఒక్కటే..

సదరు మంత్రి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒక్కటే అవ్వడంతో ఇద్దరూ పార్టీలకతీతంగా ఒక్కటయ్యారు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే నానుడి ప్రకారం చెట్టాపట్టాలు వేసుకుని వ్యాపారం చేస్తున్నట్టు అక్కడ ప్రచారం జరుగుతున్నది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంత కాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. కానీ అధికారులు పదే పదే అడ్డుకోవడంతో చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంలో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా, సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

అటు వైపునకు వెళ్లని అధికారులు..

గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానిక అధికారులకు ఓ రోజు సదరు మంత్రి అనుచరుడి నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఆ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తాను పలాన మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్లొద్దని చెప్పినట్లు సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా? కాదా? అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు.. మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమే అని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్పటినుంచి ఆ ఏరియాలో తిరిగే ఇసుక లారీలను పోలీసు, మైనింగ్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్టు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఆన్‌లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్..

ఆన్‌లైన్ బుకింగ్ లేకుండానే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ విధంగా లోడింగ్ చేస్తున్నందుకు సహకరిస్తున్న అధికారులకు ప్రతి రోజూ మామూళ్లు ఇవ్వడంతో మౌనంగా ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ప్రారంభం అవ్వని క్వారీల నుంచి సైతం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని క్వారీల్లో ఇసుక లోడింగ్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా స్థానిక గుత్తేదారులు అదనంగా రూ.2 నుంచి రూ.3 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

లోతుగా ఆరా తీస్తున్న నిఘావర్గాలు..

ఆ ఏరియాలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాలో మంత్రి, గులాబీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని వచ్చిన ప్రాథమిక నివేదికపై నిఘా వర్గాలు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నిజానికి మంత్రి ప్రమేయం ఉందా? మంత్రి పేరు చెప్పుకుని ఆ గులాబీ ఎమ్మెల్యేనే ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారా? అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Next Story