CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ : సీఎం రేవంత్‌రెడ్డి

by Muthe.Rajitha |

ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ : సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుక(Free Sand)ను అందించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం.. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని.. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని.. అధికారులు ఇసుక రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం చెప్పారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తోపాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని.. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఏరియాల వారీగా సమీప ఇసుక రీచ్‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలని సూచించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని.. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని ఆదేశించారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే.. ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను సూచించారు. ఆఫీస్ టైమింగ్స్‌లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలన్నారు. అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story