- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.. ఈ నెల 12న సంయుక్త కిసాన్ మోర్చా నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలను చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపునిచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలను చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపునిచ్చింది. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని (‘ఏకపక్ష ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్’) నిరసిస్తూ గ్రామ , గ్రామాన ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేయాలని ఎస్కేం నాయకులు పిలుపునిచ్చారు. అమోరికాకు ముందు ప్రధాని మోడీ లొంగిపోయారని, అందుకే అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను, అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లు
హిమాయత్ నగర్‌లోని మఖ్ధూంభవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్కేఎం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ, టి.సాగర్, వి. ప్రభాకర్, జక్కుల వెంకటయ్య, ఆర్.వెంకట్రాములు, మండల వెంకన్న, కె.కాంతయ్య , ఎస్కేఎం రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్, డి.జి.నరేంద్ర ప్రసాద్, బి.రాము మాట్లాడుతూ, సీ2,+ 50 శాతం ప్రకారం పంటల మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని, విత్తన, విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం-2005’ను తిరిగి పునరుద్ధరించాలని, సవరించిన -2025 చట్టాన్ని రద్దు చేయాలని, రెండు వందల పనిదినాలను పెంచి, కూలిని రూ. 600లకు పెంచాలని, కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2026-27 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎరువులపైన సబ్సిడీ తగ్గించిందని, తద్వారా ధరలు పెరుగుతాయని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయబోమని రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని మోడీ, ఆ మూడు చట్టాలను ఇతర రూపాల్లో అమలు చేస్తున్నారని, రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని దుయ్యబట్టారు. అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా ఉత్పత్తులు విచ్చలవిడిగా సరఫరా అవుతాయని, తద్వారా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, వ్యవసాయ రంగం చతికిల పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్య పద్మ మాట్లాడుతూ, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బరితెగించి అమలు చేస్తోందని విమర్శించారు. విద్యుత్ సవరణ బిల్లు అమలులోనికి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ పథకం రద్దవుతుందని, మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేస్తారని, ఆ మీటర్ల ఆధారంగా రైతుల నుంచి కూడా బిల్లులను వసూలు చేస్తారని విమర్శించారు. టి.సాగర్ మాట్లాడుతూ, అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపైన 18 శాతం పన్నులను విధిస్తారని, తద్వారా ఎగుమతులు నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని దుయ్యబట్టారు.






