అవి మోసపూరిత సంస్థలు వాటి మాయలో పడొద్దు : సజ్జనార్

by Disha Web Desk |
అవి మోసపూరిత సంస్థలు వాటి మాయలో పడొద్దు : సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్‌లపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ప్రజలకు కీలక సూచనలు చేశారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ వంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని, అవి మోసపూరిత సంస్థలని స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా మోసాలపై ప్రజలకు వివరించారు. తాజాగా ఈడీ కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని సజ్జనార్ చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయని పేర్కొన్నారు. అలాంటి మోసపూరిత స్కీమ్‌లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.

ఆర్బీఐ నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవని స్పష్టం చేశారు. బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకు సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని, నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు. మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల మాయలో పడొద్దన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ గొలుసుకట్టు సంస్థల వల్ల దేశ ఆర్థిక పరిస్థితే కాక.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed