‘రైతు డిస్కం’ అన్నదాతలకు శాపం.. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నల వర్షం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ‘బడే భాయ్’ విధానాలను ‘చోటే భాయ్’ అనుసరిస్తున్నాడని.. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.

‘రైతు డిస్కం’ అన్నదాతలకు శాపం.. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘రైతు డిస్కం’ అన్నదాతలకు శాపంగా మారనుందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఘాటైన విమర్శలు చేశారు. రైతు డిస్కం ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంట్ కోతలు విధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ ఇస్తే చాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో అంటున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా రైతులకు 13 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకురాబోయే ‘రైతు డిస్కం’ ద్వారా భవిష్యత్తులో కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

మోడీ విధానాలే ఇక్కడా అమలు..

గుజరాత్‌లో రైతులకు కేవలం 7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని.. అక్కడ ‘బడే భాయ్’ మోడీ అమలు చేస్తున్న విధానాలనే, ఇక్కడ ‘చోటా భాయ్’ రేవంత్ రెడ్డి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతు డిస్కమ్‌కు కేవలం సౌర విద్యు మాత్రమే సరఫరా చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. అలా అయితే, కేవలం సౌర విద్యుత్‌తో భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల మోటార్లు ఎలా నడుస్తాయని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఇస్తేనే రాబోయే రోజుల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.

Next Story