అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి : ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌

by Muthe.Rajitha |

అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ పనిచేస్తుందని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ తెలిపారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి : ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌
X

దిశ తెలంగాణ బ్యూరో : అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ పనిచేస్తుందని జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 106 కేసులను పరిష్కరించామని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే ఎవరైనా సరే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. డా. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో ఎన్‌హెచ్ఆర్‌సీ ఫిర్యాదులపై విచారణ, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశం మంగళవారం జరిగింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు జస్టీస్ విజయ భారతి సయానీ, డా.జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, టిఎస్‌హెచ్ఆర్‌సి చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), ఆర్ . ప్రసాద్ మీనా, రిజిస్ట్రార్ (లా) డిప్యూటీ జోగిందర్ సింగ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అంశాలను ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్మన్ వెల్లడించారు. ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణలు ఢిల్లీలో జరిగేవని ప్రస్తుంతం కేసుల దృష్ట్యా రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విచారణ ఒడిస్సా లో నిర్వహించినట్లు వెల్లడించారు. రెండవ విచారణ తెలంగాణలో నిర్వహించామన్నారు. రాష్ట్రాలలో నిర్వహించేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ చెపట్టడం ద్వారా ఢిల్లీ వరకు రాలేని భాదితులకు న్యాయం జరుగుతుందని అశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎస్‌, డీజీపీ, జైళ్ల శాఖ డీజీ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసు, జైలు అధికారుల తప్పిదం ఉంటే చర్యలకు సిపార్సు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీలో 34,865 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి కేసులు 780 ఉన్నాయని తెలిపారు. రైతుల సమస్యలు, మహిళలు, చిన్నారులపై దాడులు, దివ్యాంగుల సమస్యల గురించి వివరణ తీసుకున్నారు. వసతిగృహాల్లో సౌకర్యాలలేమిపై అధికారులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్మన్ ఆదేశించారు.

మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం.. డీజీపి జితేందర్ ఐపిఎస్

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని డీజీపి డాక్టర్ జితేందర్ తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సమావేశం అనంతరం వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఉమన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తుందన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు, భరోసా కేంద్రాల స్థాపన, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి నూతన విధానాల ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని తెలియజేశారు. మహిళలు ఇబ్బందులకు గురి చేస్తున్న ఈవ్ టీజింగ్ వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కోసం 31 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా మహిళా బాధితులకు అవసరమైన అన్ని రకాల మద్దతు ఇస్తూ వన్ స్టాప్ సెంటర్లుగా కొనసాగిస్తున్నామన్నారు.

బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాల ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నామన్నారు. ట్రాన్స్ జెండర్ సెల్, ఎన్నారై సెల్, సాహా స్ లను కొనసాగిస్తున్నామన్నారు. భవనాల నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాల్లో ఉన్న మహిళల, పిల్లల విషయంలో అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ట్రాన్స్ జెండర్లు ఎంతమంది ఉన్నారనే గణాంకలను సేకరిస్తున్నామన్నారు. స్పెషల్ సీఎస్ (హోం) శ్రీ రవి గుప్తా ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ (జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్) సౌమ్య మిశ్రా ఐపీఎస్, శాంతి భద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ , సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజిపి కోఆర్డినేషన్ ఎం. శ్రీనివాసులు సమావేశంలో పాల్గొన్నారు.

Next Story