- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ గడ్డ.. ఎవరి అడ్డా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు తమదేనని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. తామే గెలుస్తున్నామని..

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు తమదేనని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. తామే గెలుస్తున్నామని అటు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మంచి మెజార్టీతో తిరిగి విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నది. తమ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినా చివరికి విజయం తమనే వరిస్తుందని గులాబీ పార్టీ స్పష్టం చేస్తున్నది.ఈ ఎన్నికల్లో మొదటి నుంచి డిపాజిట్ సాధించడంపై దృష్టి పెట్టిన కమలం నేతలు తమ లక్ష్యాన్ని చేరుకున్నట్టు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెజార్టీపై కాంగ్రెస్ లెక్కలు..
పోలింగ్ సరళిని చూశాక తమ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నట్లు కాంగ్రెస్ లీడర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ, మెజార్టీ ఎంత వస్తుందనే అంశంపై లెక్కలు తీస్తున్నారు. డివిజన్ల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని ఆరా తీస్తూ మెజార్టీని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 20 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైనట్టు మాట్లాడుకుంటున్నారు. మంత్రులు తాము ఇన్‌చార్జిలుగా ఉన్న డివిజన్లలో మెజార్టీని అంచనా వేసేందుకు పోలింగ్ బూతుల వారీగా లెక్కలు తీస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. అందుకు గల కారణాలను కనిపెట్టే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి అరగంటకు పోలింగ్ సరళిని ఆరా తీసే పనిలో మంత్రులు పడ్డారు.
గెలుపు మాదేనంటున్న గులాబీ నేతలు
మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ ఓడిపోతుందని ఇప్పటికే ప్రకటించాయి. సర్వేలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, అయినప్పటికీ తామే గెలుస్తున్నామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ల వారీగా నమోదైన పోలింగ్ సరళిని ఆరా తీస్తూ మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తున్న కారు పార్టీ నేతలు.. ఎలాగైనా తమ గెలుపు పక్కా అని అంటున్నారు. కౌంటింగ్ రోజున తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
డిపాజిట్ పక్కా సాధిస్తాం..
మొదటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం కంటే డిపాజిట్ దక్కించుకోవడంపైనే బీజేపీ నేతలు ఫోకస్ పెట్టినట్లు విమర్శలున్నాయి. ఎందుకంటే కనీసం డిపాజిట్ కూడా రాకపోతే పార్టీ పరువు పోతుందని నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ నేతలు డిపాజిట్ ఓట్ల కోసమే కష్టపడినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత తమ పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్లను లెక్కలు వేసి, చివరికి డిపాజిట్ వస్తుందని సంతృప్తి చెందినట్లు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు.ఈసారి డిపాజిట్ దక్కదనే విమర్శల నేపథ్యంలో కమలం నేతలు తీవ్రంగా కష్టపడినట్లు పెద్దఎత్తున ప్రచారం చేసినట్టు టాక్ ఉంది.






