- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీ ప్రైమరీ పోస్టుల్లో నిబంధనలకు తూట్లు! ఎమ్మెల్యేలపై అధికార పార్టీ క్యాడర్ ఒత్తిడి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు వివాదాస్పదంగా మారాయి. గౌరవ వేతనం తక్కువైనా ఉద్యోగ భద్రత ఉంటుందనే ఆశతో ఒక్కో పోస్టుకు 30 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు వివాదాస్పదంగా మారాయి. గౌరవ వేతనం తక్కువైనా ఉద్యోగ భద్రత ఉంటుందనే ఆశతో ఒక్కో పోస్టుకు 30 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ ఆధారంగా కాకుండా కేవలం తమ అనుచరులకే పోస్టులు ఇవ్వాలంటూ అధికార పార్టీ లీడర్లు పట్టుబడుతున్నారు. నిబంధనల ప్రకారం వెళితే.. ప్రత్యర్థులకు లబ్ధి చేకూరుతుందంటూ లీడర్లు ఏకంగా ఎమ్మెల్యేలపైనే ఒత్తిడి తెస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే జాబ్స్ ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పొలిటికల్ ఒత్తిళ్లతో అటు ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి, ఇటు న్యాయపరమైన చిక్కులకు భయపడి అధికారులు సతమతమవుతున్నారు. ఎంఈఓలు, తహశీల్దార్లు సిద్ధం చేసిన మెరిట్ జాబితాలపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ రేపుతోంది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయించింది. ఈ పాఠశాలల్లో విద్యాబోధన కోసం ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు కనీస విద్యార్హత ఇంటర్‌గా నిర్ణయించారు. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, టీటీసీ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ అర్హతలు లేకుంటే బీఈడీ, ఇతర విద్యార్హతలు చూసి స్థానికులకు అవకాశాలు కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8000, ఆయాలకు రూ.6000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. జీతం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుందనే నమ్మకంతో ఈ పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.
ఎమ్మెల్యేలపై అనుచరుల ఒత్తిడి..
ప్రతి పోస్టుకు సగటున 25 నుంచి 30 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో ఎంపిక ప్రక్రియకు కొంత ఆలస్యం జరుగుతోంది. ఇదే అదునుగా భావించిన ఆశావహులు అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. రాజకీయ నాయకులు సైతం తమ పలుకుబడిని ఉపయోగించి అనుకూలమైన వారికి అవకాశాలు కల్పించేలా చక్రం తిప్పుతున్నారు. ‘రూల్స్ ప్రకారం వెళ్తే.. గత ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి అవకాశాలు దక్కే పరిస్థితులు ఉంటాయి. అందుకే నిబంధనలు పక్కనపెట్టి, కేవలం మన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సిఫారసు చేసిన వారికే పోస్టులు ఇవ్వాలి’ అని అనుచరులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ వారు సూచించిన వారికే ఇయ్యాలని అధికారులకు తేల్చి చెబుతుండగా, కొంతమంది మాత్రం రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు.
అయోమయంలో విద్యాశాఖ యంత్రాంగం..
ఇటు నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలా.. లేక రాజకీయ సిఫార్సులను అమలు చేయాలా? అన్న అంశంపై స్పష్టత లేక మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం భర్తీ చేస్తే ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడుతున్నారు. మరోవైపు నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుల ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయేమో అని ఆందోళన చెందుతున్నారు. మొత్తంపై ప్రీ ప్రైమరీ నియామకాల్లో పొలిటికల్ లీడర్ల జోక్యం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారుల వద్దకు మెరిట్ లిస్ట్‌లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నియామకాలకు సంబంధించిన మెరిట్ జాబితాను ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు. ఇంటర్మీడియట్, ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ మార్కులు, ఆధార్ కార్డు ఆధారంగా స్థానికతను గుర్తిస్తూ దరఖాస్తుదారుల జాబితాను ఆయా మండలాల ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎంఈఓలు కలిసి సంయుక్తంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల అధికార పార్టీ నాయకులు తమ మద్దతుదారులకే పోస్టులు ఇవ్వాలని పట్టుబడుతుండడంతో ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆశావహులలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.






