ప్రపంచ యాత్రికుడు అన్వేశ్‌తో సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్‌పై ఆసక్తికర సంభాషణ

by Ramesh Naini |

ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేశ్‌తో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియో కాల్‌లో మాట్లాడారు.

ప్రపంచ యాత్రికుడు అన్వేశ్‌తో సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్‌పై ఆసక్తికర సంభాషణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేశ్‌తో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (RTC MD Sajjanar) వీడియో కాల్‌లో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్‌పై ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన తండ్రి కూడా బెట్టింగ్ బాధితుడేనన్న అన్వేశ్ సజ్జనార్‌కు తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా అన్వేశ్ చేస్తున్న కృషిని సజ్జనార్ అభినందించారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, ప్రజలు బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా, ప్రజా రవాణా పెరిగేలా ప్రచారం కల్పించాలని సజ్జనార్ కోరారు. ‘మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రపంచ యాత్రికుడు అన్వేశ్‌తో నేను బెట్టింగ్ యాప్స్ నియంత్రణ, వాటిని ప్రచారం చేసే సోషల్ మీడియా ప్రముఖుల ప్రభావం గురించి మాట్లాడాను’ అని ఎక్స్ వేదికగా సజ్జనార్ పేర్కొన్నారు. వీటి నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఆర్టీసీ గురించి పేర్కొంటూ.. ఆర్టీసీ బస్సులు గొప్ప విశ్వవిద్యాలయాలని, అందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసే భిన్న సంస్కృతులకు నిలయాలు అని తెలిపారు. అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్లు నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్నారని, కండక్టర్లు ప్రతి 12 కిలోమీటర్లు నడుస్తూ టికెట్లు జారీ చేస్తున్నారని ట్వీట్ చేశారు.

Next Story