సుహృద్భావ వాతావరణంలో ఆర్టీసీ చర్చలు: గత సర్కార్‌ కంటే ‘మీరే బెటర్’ అనే అభిప్రాయానికి జేఏసీ నేతలు

by Gantepaka Srikanth |

సచివాలయంలో మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ (JAC) నేతల మధ్య చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయి.

సుహృద్భావ వాతావరణంలో ఆర్టీసీ చర్చలు: గత సర్కార్‌ కంటే ‘మీరే బెటర్’ అనే అభిప్రాయానికి జేఏసీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయంలో మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ (JAC) నేతల మధ్య చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ప్రతి కార్మిక సంఘం ప్రతినిధి అభిప్రాయాలను, డిమాండ్లను సవివరంగా నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఆర్టీసీ కార్మికుల పట్ల అత్యంత సానుకూలంగా వ్యవహరించిందని జేఏసీ నేతలు కొనియాడారు. ప్రధానంగా ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వారు గుర్తు చేశారు. 2013కు సంబంధించిన రూ. 280 కోట్ల బాండ్లను క్లియర్ చేయడం, 2017కు సంబంధించి పీఆర్సీ ఇవ్వడమే కాకుండా, ఎలాంటి పెండింగ్ లేకుండా డీఏలను (DA) మంజూరు చేయడం, సర్వీసు నుండి శాశ్వతంగా తొలగించబడిన (Removed) కార్మికుల కోసం త్రిసభ్య కమిటీ వేసి, 270 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించడం, గతంలో పేరుకుపోయిన సీసీఎస్ (CCS), పీఎఫ్ (PF) బకాయిలను ప్రభుత్వం పూర్తిగా తీర్చిందని నేతలు తెలిపారు.

గత ప్రభుత్వంపై నిప్పులు..

"గత ప్రభుత్వ హయాంలో 55 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేసినా మాకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు సరే కదా.. తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారు" అని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల కఠిన వైఖరితో పోలిస్తే, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చర్చలకు పిలిచి గౌరవప్రదంగా సమస్యలు వింటుండటం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఆర్టీసీలో అధికారికంగా యూనియన్లు లేకపోవడం వల్లే, ప్రభుత్వం చేసిన మేలు గురించి సరైన ప్రచారం జరగలేదని జేఏసీ నేతలు మంత్రులకు వివరించారు. మంత్రుల బృందం సానుకూల దృక్పథంతో ఉండటంతో, మిగిలిన డిమాండ్లపై కూడా త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీని కాపాడుకోవడంలో కార్మికులు, ప్రభుత్వం ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story