ఉచిత బస్సు పథకంతోనే RTC లాభాల బాట.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

by Kema Shiva Kumar |

ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఉచిత బస్సు పథకంతోనే RTC లాభాల బాట.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 200 కోట్ల మహిళా ప్రయాణికుల చార్జీలను రూ. 6680 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించింది. బుధవారం ఎంజీబీఎస్​ప్రాంగణంలో ఉచిత బస్సు ప్రయాణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా ప్రసంగిస్తూ భవిషత్ లో కూడా చార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, వచ్చిన ఆదాయం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని ఆర్టీసీ పై రవాణా శాఖ మంత్రి కొత్త విధానాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 62 శాతం ఉంటే ఇప్పుడు 97 శాతం‌కి పెరిగిందని అన్నారు.

మహా‌లక్ష్మి‌కి ముందు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలోచన చేసినప్పుడు హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి నగరంలో ఉన్న 2800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ కసరత్తు చేస్తుందన్నారు. ఇప్పటికే 3వేల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇవ్వగా 11 శాతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయని వాటిని పెంచుకుంటూ పోతున్నట్లు పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ‌లో కేవలం ప్రయాణమే కాదని, ఆర్టీసీ బస్సులకు యాజమానులను చేశామని, వడ్డీలేని రుణాలు ద్వారా బస్సులు కొనుగోలు చేయించినట్లు వెల్లడించారు. 150 మహిళా సంఘాల ఆర్టీసీ బస్సు యజమానులకు కోటి రూపాయల చెక్కులు ఇటీవలే అందించామని, ఇప్పటికే 25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించాం ఈ 5 ఏళ్లలో లక్ష కోట్లు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు.

మహిళ జీవితంలో భాగమైన మహాలక్ష్మి పథకం.. మంత్రి పొన్నం

మ‌హాల‌క్ష్మి పథకాన్ని విజయవంతంగా అమ‌లు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. మ‌హిళ‌ల దైనందిన జీవితంలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం భాగ‌మైంద‌ని అన్నారు. మ‌హిళ‌లు 200 కోట్ల ప్రయాణాలు చేసిన సంద‌ర్భంగా రాష్ట్రంలోని 97 డిపోలు, 324 బ‌స్ స్టేష‌న్ల‌లో ఘ‌నంగా వేడుక‌ల‌ను నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. పెరిగిన ర‌ద్దీకి అనుగుణంగా కొత్త బ‌స్సుల‌ను కొనుగోలుతో పాటు నియామ‌కాల‌ను చేప‌డుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన ర‌వాణా స‌దుపాయం, ఉద్యోగుల సంక్షేమానికి టీజీఎస్ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తోంద‌ని చెప్పారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ నీ నిర్వీర్యం చేశారు..ఆర్టీసీ ఉంటుందా అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందన్నారు. గత బీఆర్​ఎస్​పాలనలో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి ఇప్పుడు వారి డబ్బులు చెల్లిస్తున్నామని, సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యం ఉద్యోగుల సంక్షేమం నినాదంతో ఆర్టీసీ ముందుకు పోతుందన్నారు.

జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు రోడ్లు వేస్తాం: మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

ప్రజా ర‌వాణా వ్యవ‌స్థను బ‌లోపేతం చేసే దిశ‌గా ప్రతి గ్రామం నుంచి మండ‌లానికి, మండ‌ల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త ర‌హ‌దారుల నిర్మాణాన్ని త్వర‌లోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉచిత బ‌స్సు ప్రయాణ స‌దుపాయంతో మహిళ‌లు త‌మ ప్రయాణ ఖ‌ర్చుల‌ను ఆదా చేసుకోవ‌డంతో పాటు ఆర్టీసీకి కూడా మేలు జ‌రుగుతోంద‌ని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని, ఆర్టీసీ లో మహిళలకు బస్సులు కొనుగోలు చేసి యజమానులను చేసిందన్నారు. వారి చేత పెట్రోల్ బంకులు పెట్టించ డం జరిగిందని ఆర్టీసీ లో ఎవరు ఎక్కడికి వెళ్లాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ నిర్వీర్యం అయి ప్రైవేట్ పరం అవుతుందని నుండి లాభాల్లోకి వచ్చేలా చేశామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నామని స్పష్టం చేశారు.

టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జన‌ర్ మాట్లాడుతూ.. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్రస్తుతం 7913 బ‌స్సుల్లో అమ‌లు చేస్తున్నామ‌ని, ఆయా బ‌స్సుల్లో ప్రతి రోజు స‌గ‌టున 35 ల‌క్షల మంది మ‌హిళ‌లు రాక‌పోక‌లు సాగిస్తున్నార‌ని తెలిపారు. ఈ ప‌థ‌క అమ‌లుకు ముందు ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) 69 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 97 శాతానికి పెరిగింద‌ని తెలిపారు. ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోన్న ఆర్టీసీ సిబ్బందికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. ఈ వేడుక‌ల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ర‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్టీసీ ఈడీలు మునిశేఖ‌ర్‌, ఖుష్రోషా ఖాన్, రాజ‌శేఖ‌ర్, వెంక‌న్న, ఫైనాన్స్ అడ్వైజ‌ర్ విజ‌య‌పుష్ఫ, ఇత‌ర హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

Next Story