పండుగపూట మాయమైన ఉచిత బస్సులు.. ఇదే అదునుగా ‘ప్రయివేటు’ దోపిడీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-10 01:52:02  IST  )

రాఖీ పండుగతో పాటు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చాలా మంది సొంతూరు బాట పట్టారు.

పండుగపూట మాయమైన ఉచిత బస్సులు.. ఇదే అదునుగా ‘ప్రయివేటు’ దోపిడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాఖీ పండుగతో పాటు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చాలా మంది సొంతూరు బాట పట్టారు. దీన్నే అదునుగా భావించిన ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ బస్సుల పేరుతో టికెట్ ధరలు 50 శాతం వరకు పెంచి ఖజానా నింపుకునే పనిలో పడింది. ఛార్జీలు అమాంతం పెంచడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదల బలహీనతను ఆసరా చేసుకొని ఛార్జీలు పెంచడం సరికాదని మండి పడుతున్నారు. రాఖీ పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 1500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. సొంతూర్లకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, మెహిదీపట్నం బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిపోయారు.

పత్తా లేని ఉచిత బస్సులు

మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సులు పండగ వేళ కనిపించకుండా పోయాయి. ఉచితంగా వెళ్లాలని గంటల తరబడి బస్టాండ్లలో నిలబడితే డీలక్స్, రాజధాని బస్సులు మాత్రమే వస్తున్నాయని మహిళా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఆర్డినరీ బస్సులకు స్పెషల్​బోర్డు తగిలిస్తూ అదనపు చార్జీలు వసూలు చేస్తూ తమ జేబులకు చిల్లులు పెడుతున్నారని పేద, మధ్య తరగతి ప్రజలు విమర్శిస్తున్నారు. మామూలు రోజుల్లో ఉప్పల్‌ నుంచి హన్మకొండకు వెళ్లేందుకు రాజధాని బస్సులో టికెట్‌ ధర రూ.390 ఉంటే శనివారం ప్రత్యేక బస్సులో ఒక్కో టికెట్‌పై రూ.160 పెంచి రూ.550 వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు.

ప్రయివేటు ట్రావెల్స్​ దోపిడీ

ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో ప్రయివేటు ట్రావెల్స్ సైతం ఇదే అవకాశంగా భావించి ప్రయాణికుల వద్ద భారీ దోపిడీకి పాల్పడుతుందనే ఆరోపణలున్నాయి. ఎల్బీనగర్​నుంచి చౌటుప్పల్‌కు సాధారణ సమయాల్లో రూ.70 ఉంటే ప్రస్తుతం రూ.150 వరకు వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు.

స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు : టీజీఎస్‌ ఆర్టీసీ

రాఖీపౌర్ణమికి అదనపు చార్జీల వసూలుపై టీజీఎస్‌ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపింది. ఈ నెల 11 వరకు ఈ ఛార్జీలు కొనసాగుతాయని వెల్లడించింది. రద్దీకనుగుణంగా బస్సులు నడుపుతున్నామని తెలిపింది.

Next Story