ఆధార్ అప్డేట్ లేకుంటే.. ఫ్రీ టికెట్ లేదు! మహిళలను హైవేపై దించేసిన కండక్టర్.. వీడియో వైరల్

by Ramesh Naini |

మహిళలకు ఈ సౌకర్యం వచ్చిన తర్వాత బస్సుల్లో ఎప్పుడూ ఎదో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది.

ఆధార్ అప్డేట్ లేకుంటే.. ఫ్రీ టికెట్ లేదు! మహిళలను హైవేపై దించేసిన కండక్టర్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు (Free bus travel) ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు ఈ సౌకర్యం వచ్చిన తర్వాత బస్సుల్లో ఎప్పుడూ ఎదో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఇక (Aadhar card update) ఆధార్ అప్డేట్ లేకుంటే మాత్రం కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అప్డేట్ లేకపోతే టికెట్‌కు డబ్బులు ఇవ్వాలని కండక్టర్లు చెబుతున్నారు. లేదంటే బస్సులను నడిరోడ్డుపై ఆపి మహిళలను దించేసిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఆధార్ కార్డు అప్డేట్ లేకుంటే ఫ్రీ బస్ టికెట్ ఇవ్వనని చిన్న పిల్ల తల్లి సహా ముగ్గురు మహిళలను ఆర్టీసీ కండక్టర్ హైవే మీద దించేశారు. సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్లే దారిలో ఆధార్ కార్డు అప్డేట్ లేదని హైవేపై వదిలేశారు. చిన్న పిల్ల తల్లి ఉందని చూడకుండా నడి రోడ్డుపై దించేశారు. ఇదేమి పద్ధతి, ఇదేమి రాజ్యం మాకు చాలా ఇబ్బందిగా అన్పిస్తోంది. లారీలు పోయే హైవేపై మమ్మల్ని డ్రైవర్, కండక్టర్ దించిపోయారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము’ అని మహిళ వాపోయారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులను ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. ఆధార్ అప్డేట్ లేకుంటే ఎందుకు ఎక్కించుకోరు.. కండక్టర్ కి కావాల్సింది ఆ వ్యక్తి ఊరు పేరు అప్ డేట్ దేనికి? అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ఓ నెటిజన్ ప్రశ్నించారు.

ఆధార్ అప్డేట్ చెయ్యకపోతే బస్సులో ఎక్కించుకోరా? ఏ స్టేట్ చూస్తే సరిపోద్ది..? లేదంటే అప్డేట్ చేస్కో అని సున్నితంగా చెప్పొచ్చని ఆర్టీసీకి నెటిజన్‌లు సూచించారు. కాగా, ఉచితంగా బస్సులో ప్రయాణించే మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించి జీరో టికెట్ పొందవచ్చు. ఆధార్ కార్డు లేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించి ఉచిత టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని గతంలో (TGSRTC) ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

Next Story