ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు..! భారీగా ప్రయాణికులు తగ్గే చాన్స్

by Kema Shiva Kumar |

నాడు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారంటే రాష్ట్ర స్థాయిలో అది చర్చనీయాంశంగా ఉండేది.

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు..! భారీగా ప్రయాణికులు తగ్గే చాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాడు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారంటే రాష్ట్ర స్థాయిలో అది చర్చనీయాంశంగా ఉండేది. తగ్గించేందుకు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేవి. కానీ ఇప్పుడు చార్జీల పెంపుపై అప్పటికప్పుడు ఏదో ఓ ప్రకటన, ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలు మరిచిపోతున్నాయి. అయితే చార్జీల పెంపు సహేతుకంగా ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇష్టానుసారంగా పెంచుతూపోతే కనీసం ఆర్టీసీ బస్సెక్కేవారు సైతం కరువయ్యే పరిస్థితి రానుందని రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగినా నేరుగా వచ్చే రాబడి మాత్రం తగ్గిపోయింది. ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం నుంచి నెలనెలా ఆర్టీసీకి రావాల్సిన రూ.325 కోట్ల నిధులు సజావుగా రాకపోవడంతో ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లేందుకు యాజమాన్యం చార్జీల పెంపును ముందుకు తీసుకొస్తున్నదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

క్యాష్ కలెక్షన్లపై టార్గెట్

ఉచిత బస్సు ప్రయాణంతో సగటున ప్రతి బస్సులో 65శాతానికి పైగా మహిళలే ఉంటున్నారు. దీంతో ఆర్టీసీకి నేరుగా వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ఫలితంగా నిర్వహణకు సంస్థ తీవ్ర అగచాట్లు పడుతోంది. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. టికెట్ తీసుకునే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంటే కలెక్షన్ ఎలా వస్తుందని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయం ఇదేనా?

అసలే టికెట్ తీసుకుని ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోతున్న వేళ బస్సు చార్జీలు పెంచడమంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్లినట్లేనని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రత్యామ్నాయంగా చార్జీల తగ్గింపును రవాణా రంగ నిపుణులు, కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి లేని గరుడ, రాజధాని, పుష్పక్ తదితర ఏసీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలకు డిస్కౌంట్ విధానం తీసుకురావాలని చెబుతున్నారు.

20 నెలల్లో 200 కోట్ల ఫ్రీ జర్నీ

పథకం ప్రారంభమైన తొలి 20 నెలల్లో 200కోట్ల మంది అంటే నెలకు 10 కోట్ల మంది.. రోజుకు 33.33 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. అనధికారికంగా రోజుకు 43 లక్షల మంది వరకు ఆ ర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. క్రమంగా బస్సు ల్లో ప్రయాణించే పురుషుల శాతం తగ్గిపోతున్నది. మరోవైపు నవంబర్ 2023లో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షలు మాత్రమే. అంటే ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు పెరిగిందో అర్థమవుతుంది. కానీ బస్సుల సంఖ్య పెంచలేదు.

డిస్కౌంట్ ఇస్తే మంచింది

మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం లేని డీలక్స్, సూపర్ లగ్జరీ తదితర బస్సుల్లో మహిళలకు కనీసం 40శాతమైనా డిస్కౌంట్ ఇస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుం ది. ఫలితంగా బస్సుల్లో కిక్కిరిసి చేసే ప్రయాణాలకు చెక్ పె ట్టేందుకు అవకాశం ఉంటుంది. చెల్లింపు టికెట్ల సంఖ్య పెరిగి ఆర్టీసీకి నేరుగా ఆదాయం పెరుగుతుంది. యాజ మాన్యం ఈ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - థామస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎంయూ

Next Story