TG: ప్రమాదాలు జరుగుతున్నా కనిపించని మార్పు.. మొత్తం 9 స్లీపర్ బస్సుల సీజ్

by Gantepaka Srikanth |

కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ మేల్కొంది.

TG: ప్రమాదాలు జరుగుతున్నా కనిపించని మార్పు.. మొత్తం 9 స్లీపర్ బస్సుల సీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ మేల్కొంది. ఈ సంఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న ఏసీ స్లీపర్ బస్సులపై కఠిన తనిఖీలు ప్రారంభించారు. అక్టోబర్ 25 నుంచి 31 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 244 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.61 లక్షల కంటే ఎక్కువ జరిమానాలు వసూలు చేశారు. మొత్తం 9 స్లీపర్ బస్సులను సీజ్ చేశారు. కేవలం అక్టోబర్ 31న ఒక్కరోజే 30 వాహనాలపై చర్యలు తీసుకొని రూ.1.06 లక్షల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. తనిఖీల్లో పలువురు బస్సు యజమానులు, డ్రైవర్లు భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వాహన రంగు మార్పులు చేయడం, రిఫ్లెక్టివ్ టేపులు లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక సిలిండర్లు లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం లేకుండా విధులు నిర్వహించడం, ఇంకా వాణిజ్య సరుకులను రవాణా చేయడం వంటి ఉల్లంఘనలు కనిపించాయి.

చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు పనిచేయని స్థితిలో ఉన్నాయి. కొన్నింటిలో ఎమర్జెన్సీ విండోలు, డోర్లు మూసివేసిన పరిస్థితి కనిపించిందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇవన్నీ ప్రయాణికుల ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయి. రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా... ప్రైవేట్ బస్సు యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా సర్వీసులను నిర్వహిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. అధికారులు ఓవైపు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు జనంలో ఆగ్రహావేశాలు పెరిగినప్పుడు భావోద్వేగాలు సద్దుమణిగే వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తర్వాత యధామామూలుగా వ్యవస్థ మారిపోవడం గతంలోనూ చాలా సార్లు జరిగింది. ఈసారైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ట్రావెల్స్ పై కఠినంగా చర్యలు తీసుకునాలని రవాణా రంగ నిపుణులు కోరుతున్నారు. కాగా... తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏసీ స్లీపర్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

Next Story