విద్యార్థుల భద్రతే ముఖ్యం.. స్కూల్ బస్సులపై ఆర్టీఏ నజర్

by Naga Rani Yarlagadda |

ఏటా జూన్ వచ్చిందంటే చాలు.. అటు తల్లిదండ్రుల్లో ఇటు రవాణా శాఖలో ఒకటే గుబులు. వేసవి సెలవులు ముగిసి బడులు పునఃప్రారంభం అవుతున్నాయంటే.. రోడ్లపైకి మళ్లీ డొక్కు స్కూల్ బస్సులు క్యూ కట్టబోతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

విద్యార్థుల భద్రతే ముఖ్యం.. స్కూల్ బస్సులపై ఆర్టీఏ నజర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏటా జూన్ వచ్చిందంటే చాలు.. అటు తల్లిదండ్రుల్లో ఇటు రవాణా శాఖలో ఒకటే గుబులు. వేసవి సెలవులు ముగిసి బడులు పునఃప్రారంభం అవుతున్నాయంటే.. రోడ్లపైకి మళ్లీ డొక్కు స్కూల్ బస్సులు క్యూ కట్టబోతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫీజుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ, విద్యార్థుల ప్రాణాల రక్షణపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఉండటం లేదనేది బహిరంగ రహస్యం. ఫిట్‌నెస్ లేని వాహనాలు, అనుభవం లేని డ్రైవర్లు, నిబంధనలకు విరుద్ధంగా గొర్రెల మందల్లా విద్యార్థులను కుక్కే ఓవర్‌లోడింగ్ సంస్కృతి ఏటా పసిప్రాణాలను బలితీసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రవాణా శాఖ ఈసారి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. బడులు తెరిచేనాటికి ప్రతి విద్యాసంస్థ వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. అయితే, ఏటా ప్రకటనలు చేయడం.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో మామూలుగా వ్యవహారం సాగిపోవడం పరిపాటిగా మారింది. గతంలో జరిగిన ఘోర ప్రమాదాలు విద్యాసంస్థల నిర్లక్ష్యానికి, ఆర్టీఏ నిఘా లోపానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

గతంలో జరిగిన పలు ప్రమాదాలు..

తనిఖీలు, హెచ్చరికల వెనుక ఉన్న అసలు అవసరాన్ని గుర్తించాలంటే గతంలో జరిగిన కొన్ని గుండెల్ని పిండేసే ప్రమాదాలను గుర్తుచేసుకోవాల్సిందే. జులై 24, 2014లో ఉమ్మడి మెదక్ జిల్లా యాదారంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు.. మాసాయిపేట వద్ద రైల్వే గేట్ లేని లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్, అటెండర్‌తోపాటు 16 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ అజాగ్రత్త, యాజమాన్యం నిర్లక్ష్యమే విద్యార్థుల ఇండ్లల్లో శాశ్వత చీకట్లు నింపింది. అలాగే ఆగస్టు 2023లో హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ వద్ద ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్‌ను ఢీకొట్టగా పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అలాగే నవంబర్ 2024లో యాదాద్రి భువనగిరి జిల్లాలో అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సు రోడ్డు పక్కెన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది జనవరి 2న ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులుగూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 106 మంది విద్యార్థులు ఉండగా, 40 మందికి గాయాలయ్యాయి. ఇలాంటి అనేక ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నిబంధనలు ఇవే..

- వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్

- అనుమతించిన సామర్థ్యం మేరకే విద్యార్థులను ఎక్కించుకోవాలి

- డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం

- ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు

- వాహనాల బ్రేకులు, టైర్లు, లైట్లు, ఇతర యాంత్రిక భాగాల పనితీరు

- విద్యార్థుల భద్రత కోసం అటెండర్‌ను నియమించారా లేదా.

తల్లిదండ్రులూ జాగ్రత్త!..

స్కూల్ బస్సుల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి లోపాలున్నా దానికి పూర్తి బాధ్యత సదరు పాఠశాల లేదా కళాశాల యాజమాన్యాలదేనని రవాణా శాఖ తేల్చి చెప్పింది. నిబంధనలు అతిక్రమిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో తల్లిదండ్రులకు కూడా అధికారులు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. కేవలం స్కూల్ యాజమాన్యాలపైనే భారం వేయకుండా.. తమ పిల్లలను ఎక్కించే వాహనం కండిషన్ ఎలా ఉంది? డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది? అనేది తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఓవర్‌లోడ్‌తో నడిచే ఆటోలు, వ్యాన్లు, బస్సుల్లో పిల్లలను పంపవద్దని, ఒకవేళ తనిఖీల్లో ఆ వాహనాలను సీజ్ చేస్తే మధ్యలో పిల్లలు ఇబ్బంది పడతారని రవాణా శాఖ గుర్తుచేసింది. అయితే అధికారులు ఏటా ప్రకటనలు, హెచ్చరికలు కాగితాలకే పరిమితం కావడం, బడులు తెరిచిన మొదటి వారం రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత తనిఖీలు ఆపేస్తే మళ్లీ పాత కథే పునరావృతమవుతుంది. ప్రతి ప్రైవేటు విద్యాసంస్థ కమర్షియల్ ఆలోచనలను పక్కనబెట్టి, విద్యార్థుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రవాణా శాఖ అధికారులు కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ఫిట్‌నెస్ లేని ప్రతి వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించినప్పుడే విద్యార్థుల ప్రాణాలకు రక్షణ దొరుకుతుంది.

Next Story