జూన్ 8 వరకు గడువు.. రూ.148 కోట్లు మంజూరు.. అప్రోచ్ రోడ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by Prasad Jukanti |

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్ల విషయంలో బినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.

జూన్ 8 వరకు గడువు.. రూ.148 కోట్లు మంజూరు.. అప్రోచ్ రోడ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‍లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయని వీటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, అమలు చేయడం సులభం అవుతుందని పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ సీఎం అన్నారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే సబ్ కమిటీలు చర్చించి ఆమోదం తెలుపుతామని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

జూన్ 8 లోపు నిర్మాణాలు పూర్తి:

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జూన్ 8 లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని తాను ప్రత్యేకంగా ప్రతి వారం సమీక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం, నాణ్యతతో పనులు పూర్తి చేయడం వంటి అన్ని అంశాలను తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story