ప్రజారోగ్యానికి ప్రణాళికలు..ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణం

by Ajay Maddhiboyina |

ప్రజారోగ్య రంగంలో ఎదురవుతోన్న పలు సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. కీలకమైన పలు అంశాలపై ఫోకస్ చేస్తూ ప్రజారోగ్య పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రజారోగ్యానికి ప్రణాళికలు..ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణం
X

దిశ తెలంగాణ బ్యూరో : ప్రజారోగ్య రంగంలో ఎదురవుతోన్న పలు సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. కీలకమైన పలు అంశాలపై ఫోకస్ చేస్తూ ప్రజారోగ్య పథకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్నది. కొంతకాలంగా ప్రజారోగ్య రంగంలో తెలంగాణ మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఇంకా అనేక అంశాల్లో మార్పు తీసుకు రావాల్సి ఉంది. 3 కోట్లా 85 లక్షల జనాభా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్ఠ జీవన వయస్సు 70 సంవత్సరాలు. జాతీయ సగటుతో పోలిస్తే చిన్నపిల్లల మరణాలు ఇక్కడ తక్కువే. ప్రసవ సమయాల్లో తల్లుల మరణాలు లక్షకు జాతీయ సగటు (93)తో పోలిస్తే సగం (45) కంటే తక్కువ. సుమారు 80% మంది పిల్లలు పూర్తిగా టీకాలు వేయించుకున్నారు. ఇది జాతీయ సగటు 76%గా ఉంది.

ప్రతి మూడింటిలో రెండు వ్యాధులు ఎక్కువ

నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విషయంలో మాత్రం ప్రతి మూడింటిలో రెండు అసాంక్రమిక వ్యాధులే ఉంటున్నాయి. ఇందులో మధుమేహం, స్ట్రోక్, సీఓపీడీ, గుండె వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు హైబీపీతో, జనాభాలో 15% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. లక్ష మందిలో 72 మంది క్యాన్సర్‌కు గురవుతున్నారు. ఇలాంటి వ్యాధుల వల్ల 30-70 ఏళ్ల వయస్సు గల వారు 25% అకాల మరణానికి గురవుతున్నారు.

42% అధిక రక్తపోటుతో ఇబ్బంది

మొత్తం జనాభాలో 60 ఏళ్ల వయస్సు దాటిన వారు 11 శాతం ఉంటే 2035 కల్లా వీరు 17 శాతానికి చేరుకుంటారు. ఇందులో 42% అధిక రక్తపోటుతో, 33% ఎముకలు, కీళ్ల వ్యాధులతో, 16% మధుమేహంతో బాధపడుతున్నారు. ఇందులో సగం మంది అసలు చికిత్సనే పొందడం లేదు. 65% మందికి కంటి సంబంధిత వ్యాధులు ఉండగా 55% మంది దైనందిక చర్యలతోనూ ఇబ్బంది పడుతున్నారు. ఇక అత్యధికంగా సిజేరియన్లు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల్లో 85% ఇవే ఉంటున్నాయి. 40 నుంచి 49 మధ్య ఉన్న మహిళల్లో ఐదుగురిలో ఒకరు హిస్టరక్టమీ సర్జరీ ప్రయివేటు ఆస్పత్రిలోనే చేయించుకున్నారు.

జనాభాకు తగ్గ సౌకర్యాలు కరువు

దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో జనాభాకు తగినంత సౌకర్యాలు లేకపోవడంతో మెజారిటీ రోగులకు సరైన టైంలో చికిత్స అందడం లేదు. వైద్య నిపుణుల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. ప్రజల్లోనూ ఆరోగ్య, అక్షరాస్యతపై అవగాహన లేకపోవడంతో సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. ఇక వైద్య అవసరాల కోసం చేసే ఖర్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన గరిష్ట శాతం 20గా ఉండగా తెలంగాణలో అది 40 శాతంగా ఉంది. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

2030 కల్లా నాణ్యమైన వైద్యం

ప్రభుత్వం అమలు చేయబోతోన్న కొత్త స్కీమ్‌తో రాష్ట్రంలోని కోటిన్నర జనాభాకు 2030 కల్లా నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేస్తూనే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై దృష్టి పెరిగేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నడక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. యోగాతో పాటు ఓపెన్ జిమ్‌లు సైతం ఏర్పాటు చేసి వీటన్నింటినీ రియల్ టైం ట్రాకింగ్ ద్వారా ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేయనున్నారు. ప్రజలకు మంచి డైట్ తీసుకునేలా అలవాటు చేయడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడంపై అవగాహన కల్పించనున్నారు. అనవసరమైన సర్జరీలకు వెళ్లకుండా మహిళల్లో అవగాహన కల్పించడం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక పారిస్ ఒప్పందాన్ని అనుసరించి ఎలాంటి పర్యావరణ సంబంధిత సమస్యలు ఏర్పడకుండా, ప్రోగ్రాం అమలు చేసే విషయంలో ప్రభావంతమైన స్టెప్స్ తీసుకోనున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతను తగ్గించే ఉద్దేశంతో ఏర్పాటైన కూల్ రూఫ్ పాలసీ, 2050 కార్బన్ న్యూట్రాలిటీ టార్గెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి.

Next Story