రూ.2 వేల కోట్ల భూ కుంభకోణం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-09 01:59:49  IST  )

కబ్జాదారులు రోజుకో కొత్త ఎత్తుతో ప్రభుత్వ భూములను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు.

రూ.2 వేల కోట్ల భూ కుంభకోణం
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలంలో రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా పక్కా ప్లాన్ వేసింది. అసలు ఆ స్థలానికి లేని దస్తావేజులు సృష్టించింది. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసింది. వాటినే లింక్ డాక్యుమెంట్లుగా చూపిస్తూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇందులో భాగంగా తొలుత ఎకరం భూమితో ఈ ప్రయత్నం మొదలు పెట్టారు. తాము అనుకున్నట్టుగానే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అధికారులతో కోర్టును తప్పుదోవ పట్టించి ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తమ ప్లాన్ పక్కాగా వర్కవుట్ కావడంతో దానినే బేస్ చేసుకుని సర్వే నంబర్ 44లోని 41.13 ఎకరాలను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అది ప్రభుత్వ భూమి అని తెలిసినా.. ఆ భూమి చుట్టూ కంచె వేసినా శేరిలింగంపల్లి రెవె న్యూ అధికారులు ఇన్నాళ్లు పట్టించుకోలేదు.

కన్నెత్తి చూడని అధికారులు

మియాపూర్-బాచుపల్లి సరిహద్దుల్లో ఉన్న ఈ భూమి ధర ప్రస్తుతం ఎకరానికి రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల ధర పలుకుతోంది. 1967 ఫిబ్రవరి 12న ఇతరుల పేరిట రిజిస్టర్ అయినట్లుగా లింక్ డాక్యు మెంట్ (311/1967)ను తయారు చేశారు. అనంతరం ఈ భూమిలో తొలుత ఒక ఎకరం భూమిని తమ పేరిట రిజిస్టర్ చేయించుకునేందుకు సేల్ డీడ్ చేసుకున్నారు. మక్తా మహబూబ్‌పేట్ సర్వే నంబరు 44 (పాత సర్వే నంబరు 116)లో 1840 చదరపు గజాల స్థలానికి క్రయవిక్రయాలు జరిగినట్లు అందులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి సి 438/2025 నంబరు, బుక్-1 దస్తావేజును రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు 2025 జూలై 13న తిరస్కరించారు. మక్తా మహబూబ్‌పేట సర్వే నంబరు 44లోని భూమి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా (22ఏ జాబితాలో) ఉన్నందున.. రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 22(1)(బి) ప్రకారం రిజిస్ట్రేషన్ నిషేదితమని పేర్కొంటూ రీ హేజల్ ఆధార్ (నంబరు 269/ 2025) ఇచ్చారు. తిరస్కరణకు కారణాలుగా భూమి మొత్తం విస్తీర్ణం (266 ఎకరా లు)లో కలిసి ఉందని, భూ మార్పిడి జరగలేదని, నాలా సర్టిఫికెట్ ఇవ్వలేదని, అందుకు సంబంధించిన ఆధారాలు లేవని తెలిపారు. అంతేకాకుండా 2019 మే 1న ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మెమో నంబరు 23/3247/2018 నిబంధనలకు విరుద్ధం గా ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్ తిరస్కరించిన దాన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ డా క్యుమెంట్ రిజిస్ట్రేషను అనుమతించాలని కో రుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భూ మిపై హక్కు ఉన్నట్లు లింక్ డాక్యుమెంట్ (311/1967) చూపించి.. ఇందుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని వాల్యూమ్ నంబరు 173 పేజీ నంబరు 211లో ఉన్నట్లు పేర్కొ న్నారు. దీంతో సంబంధిత వ్యక్తులకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. దాని ఆధారంగా రంగారెడ్డి ఎస్ఆర్‌వో గత ఏడాది సెప్టెంబరు 28న 14380/2025 సేల్ డీడ్‌ను రిజిస్టర్ చేశారు. అయితే విచారణలో కోర్టును వారు తప్పుదారి పట్టించినట్లు సమాచారం. 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని మాత్రమే కోర్టును ఆశ్రయించిన సదరు ముఠా ఎకరానికి సేల్ డీడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇందుకు రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్‌తో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులూ సహకారం అందించారనే ఆరోపణలున్నాయి. గతంలో ఒక ఎకరా కబ్జా చేసిన ఈ ముఠా తాజాగా మొత్తం 43 ఎకరాల భూమిని స్వాహా చేసింది. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

మొదటి నుంచే అనేక అనుమానాలు

సాధారణంగా ఏదైనా కేసు విషయంలో కోర్టుకు అప్పగించిన తరువాత ఆ రికార్డును మళ్లీ కోర్టు అనుమతితో వెనక్కి తీసుకొస్తారు. కానీ ఈ వాల్యూమ్‌ను అధికారులు వెనక్కి తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్యూమ్ బుక్ లేకుండా, ఇతర రికార్డులు అందుబాటులో లేకపోయినా 14380/2025 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల సమయంలో అధికారులు మదర్ డాక్యుమెంట్‌కు ఉన్న చట్టబద్ధతను తనిఖీ చేయకుండానే అనుమతించినట్లు స్పష్టమవుతోంది. ఇంత జరిగినా ఏ ఒక్క ఉన్నతాధికారి స్పందించకపోవడం, వాటిని పరిశీలించకపోవడం పట్ల, అధికారుల వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మంత్రి పొంగులేటి ఆదేశంతో పీడీ యాక్ట్

రూ. 2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కుట్ర వెలుగులోకి రావడంతో గతంలో కబ్జాదారులకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతోపాటు సదరు సబ్ రిజిస్ట్రార్ మీద పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2గా వ్యవహరిస్తున్న కె.మధుసూదన్‌రెడ్డిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా ఆదేశించారు.

Next Story