వాళ్లను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం తరపున రూ.2లక్షలు.. ఉత్వర్వులు జారీ

by Ajay Maddhiboyina |

వికలాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

వాళ్లను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం తరపున రూ.2లక్షలు.. ఉత్వర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వికలాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో కేవలం పరిమిత సహాయం మాత్రమే అందిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల మధ్య జరిగే వివాహాలకు అందజేస్తున్న వివాహ ప్రోత్సాహక నగదును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ప్రకటనలో తెలిపారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు.

ఈ ఆర్థిక సహాయం భార్య పేరున నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కోందన్నారు. ఈ నిర్ణయంతో వికలాంగుల మధ్య వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సామాజిక అంగీకారం పెరుగుతుందని, వివక్ష తగ్గుతుందని, అలాగే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల కోసం పింఛన్ల పెంపు, సంక్షేమ పథకాల విస్తరణ, ఆర్థిక సహాయాల పెంపు వంటి చర్యలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. మాటల్లో కాకుండా, కార్యాచరణలో వికలాంగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం స్పష్టంగా చూపుతోందన్నారు. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి వికలాంగులు, సీనియర్ సిటిజన్లు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Next Story