రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదు.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 10:40:53  IST  )

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి, బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.

రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదు.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు పునరావృతమవుతున్నాయని, ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏఐఎంఐఎం (AIMIM), కాంగ్రెస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో జరిగిన గొడవలకు కాంగ్రెస్సే అగ్నికి ఆజ్యం పోసిందని, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి (Venkataramana Reddy) ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని బండి సంజయ్ విమర్శించారు.

పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు..

బాన్సువాడ (Bansuwada)లో జరిగిన సంఘటనలపై స్పందిస్తూ.. రాళ్ల దాడి స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తే, తిరిగి తమపైనే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటని కౌంటర్ ఇచ్చారు. బాన్సువాడలో 70 మంది బీజేపీ (BJP) కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే, బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అరాచక ఘటనలను ప్రజలు గుర్తుంచుకోవాలని, రౌడీయిజం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. కాంగ్రెస్ నేత వీహెచ్ తీవ్ర ఆరోపణలు

Next Story