ROR Act: ‘భూధార్’ బెస్ట్..! కొత్త ఆర్వోఆర్ చట్టంలో ప్రత్యేకాంశం

by Kema Shiva Kumar |

భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో ‘భూదార్’ను చేర్చింది.

ROR Act: ‘భూధార్’ బెస్ట్..! కొత్త ఆర్వోఆర్ చట్టంలో ప్రత్యేకాంశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో ‘భూదార్’ను చేర్చింది. ప్రతి మనిషి చిరునామా, గుర్తింపుని తెలిపే ఆధార్ మాదిరిగానే.. ప్రతి ఆస్తికి భూదార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఇది ప్రాపర్టీ అడ్రస్ ను చెబుతుంది. ఏ భూ సంస్కరణను తీసుకురావాలన్నా ఈజీగా అమలు చేసేందుకు వీలుగా ఈ యూనిక్ కోడ్ దోహదపడనున్నది. ఇప్పటి వరకు మాన్యువల్ రెఫరెన్స్ ని క్రియేట్ చేశారు. కొత్త చట్టం ద్వారా జియో ట్యాగ్స్ తో ప్రాపర్టీని గుర్తించే వీలవుతుంది. దీంతో ఇప్పటి దాకా రైతుకు మాత్రమే ఉండే యూనిక్ నంబర్ ను.. ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అక్రమాలకు చెక్ పడడమే కాకుండా.. ఆస్తికి సరైన గుర్తింపు ఇస్తూ.. భూమి, ఆస్తి హక్కుదారులకు తోడ్పాటు అందుతుంది.

కేంద్రం సూచనలకు అనుగుణంగా..

దేశంలో రైతులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలుగా ఆధార్ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థను నెలకొల్పాలని ఆదేశించింది. రాష్ట్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం, వివిధ శాఖలతో సమన్వయం చేసేందుకు ప్రాజెక్టు నిర్వహణ యూనిట్ (పీఎంయూ)ని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో తెలంగాణ కూడా కేంద్రం సూచనలకు అనుగుణంగా పీఎంయూని ఏర్పాటు చేసింది. దీనికి హెడ్ గా వ్యవసాయ సంచాలకులు బి.గోపి, సభ్యులుగా సీసీఎల్ఏ కార్యదర్శి మంద మకరందం, ఐటీ శాఖ డిప్యూటీ కార్యదర్శి భవేశ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వర్ రెడ్డి, ఐటీ శాఖ సీనియర్ సంచాలకులు రాధాకృష్ణలను నియమించింది. రైతుల వారీగా పంటలు, పశు సంపద వంటి సమస్త సమాచారం కేంద్రానికి అందుతుంది. పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర లావాదేవీలకు వీలుగా కూడా ఇది ఉండాలని కేంద్రం భావిస్తున్నది.

జియో ట్యాగ్స్‌తో గుర్తింపు..

ఇప్పటి దాకా సర్వే నంబర్లు, సబ్ డివిజన్లతోనే వ్యవహారం నడిచింది. ఉదాహరణకు సర్వే నంబర్ 10.. అనే వాళ్లం. అయితే అది అన్ని గ్రామాల్లోనూ ఉంటుంది. జిల్లా, డివిజన్, మండలం, రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు, సబ్ డివిజన్ .. ఇన్నింటిని టైప్ చేస్తే తప్ప ఆ ఆస్తి గురించి వివరాలు తెలియవు. ఇప్పుడా కష్టతరమైన సమస్యకు పరిష్కారమే యూనిక్ నంబర్. దాన్ని భూదార్, స్వమిత్వ, ప్రాపర్టీ కార్డ్ వంటి పేర్లతో ఏదో ఒక దాన్ని ఖరారు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియను కొందరు అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు తప్పు పడుతున్నారు. ఆ అవసరం ఏమిటంటూ ప్రభుత్వానికి రిపోర్టులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో భూదార్ అంశంపై చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ప్రతి రైతు ల్యాండ్ పార్శిల్ కి భూదార్ ఇవ్వాలన్న సదుద్దేశ్యాన్ని విమర్శించిన అధికారులకు.. ఇకనైనా కనువిప్పు కలిగితే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

క్లియర్‌గా ఉంటేనే..

తెలంగాణలో క్లియర్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నింటికీ టెంపరరీ భూదార్ ఇవ్వాలని ప్రతిపాదించారు. టెంపరరీ ఎందుకన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి ఒక చోట, సర్వే నంబర్ మరో చోట ఉండే పరిస్థితులే అధికం. పైగా రికార్డుల్లో కంటే పాసు బుక్కుల్లో అధికంగా విస్తీర్ణం నమోదైంది. సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మినెంట్ భూదార్ నంబర్ ఇచ్చే వీలున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్ పొందేందుకు అవసరమైన ఒక ముందడుగు పడుతుంది. సర్వే చేసేందుకు కూడా ఈ తాత్కాలిక నంబర్లు ఉపయోగపడుతాయి. పట్టాదారుడికి యూనిక్ నంబర్ ఇచ్చారు. ఇది వైఎస్ హయాంలో కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల్లో భాగంగా జరిగింది. ఇప్పుడదే భూములకు/ఆస్తులకు కూడా అప్లయ్ చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు సమస్యలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడనున్నది. పైగా ల్యాండ్ రికార్డుల్లో స్పష్టత వస్తుంది. భూ సంబంధ సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తనఖా పెట్టిన ఆస్తులు, రైతుబంధు, పీఎం కిసాన్ యోజన పొందుతున్న ఆస్తుల లెక్క తెలుస్తుంది. ఇవన్నీ ఒక గ్రిడ్ లో పెట్టడం ద్వారా పక్కా లెక్కలు తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల లక్ష్యంతో ప్రారంభించిన యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్(యూఎల్పీన్) పథకం అమలుకు ఉపయోగపడుతుంది.

ప్రయోజనాలు ఇవీ..

-ప్రతి ఆస్తికి చిరునామా లభిస్తుంది.

-ప్రతి ప్రాపర్టీకి ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుంది.

-ఆ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే చోట చూసుకోవచ్చు.

-ఆ స్థలం చరిత్ర ఒక్క క్లిక్ తో స్పష్టంగా తెలుస్తుంది.

-యూనిక్ నంబర్ లోనే సపోర్టింగ్ డ్యాక్యుమెంట్ (లింక్ డాక్యుమెంట్లు) కూడా వచ్చే ఏర్పాటు. డిజిటల్ రూపంలో పూర్తి సమాచారం తెలుస్తుంది.

-ఆధార్ తో ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చునో.. భూమికి సంబంధించిన ప్రయోజనాలు ఈ యూనిక్ నంబర్ ద్వారానే అందుతాయి. బ్యాంకుల్లో దీని ద్వారానే రుణాలు తీసుకోవచ్చు. రుణం తీసుకుంటే ఆన్ లైన్ లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు భూమి పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టాల్సిన అవసరం ఉండదు.

-ఆస్తి విలువ పెరుగుతుంది. దాని ద్వారా భూయజమానికి రుణాలు పొందడం సులువవుతుంది. ల్యాండ్ హిస్టరీ ఈజీగా తెలుస్తుండడంతో రుణం కూడా అధికంగా వస్తుంది.

-ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను వసూలు ఈజీ అవుతుంది. అలాగే క్రయవిక్రయాల్లో స్టాంప్ డ్యూటీ రెవెన్యూ పెరుగుతుంది.

Next Story