రోబోలతో SLBC టన్నెల్‌లోకి అధికారులు

by Gantepaka Srikanth |

SLBC సొరంగం వద్ద చేపట్టిన సహాయక చర్యలు మంగళవారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి.

రోబోలతో SLBC టన్నెల్‌లోకి అధికారులు
X

దిశ, అచ్చంపేట: SLBC సొరంగం వద్ద చేపట్టిన సహాయక చర్యలు మంగళవారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. SLBC ఘటన ప్రదేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా సహాయక చర్యలకు అవసరం మేరకు రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం అన్వి రోబో బృందం సభ్యులు రెస్క్యూ ఆపరేషన్ కోసం సొరంగంలోకి వెళ్లారు. వీరితోపాటు వివిధ కంపెనీలకు చెందిన 11 రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా సహాయక చర్యల్లో భాగంగా నేటి మొదటి షిఫ్ట్‌లో 110 మంది టన్నెల్‌‌లోకి వెళ్లారు.

ప్రమాద సంఘటన జరిగిన 14 కిలోమీటర్ల వద్ద దాని ముందు భాగంలో సుమారు 50 మీటర్ల దూరాన అతి రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ ఉన్న నేపథ్యంలో.. ఎనిమిది మందిలో ఇప్పటికే రాబిన్స్ కంపెనీకి చెందిన సన్ ప్రీత్ సింగ్ మృతదేహాన్ని గత రెండు రోజుల క్రితం సింగరేణి కార్మికులు తొవ్వకాల ద్వారా వెలికి తీశారు. మిగిలిన ఏడు మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో రోబోను అధికారులు రంగంలోకి దింపారు. సహాయక చర్యలను రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్, ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ ఇతర రెస్క్యూ బృందాల నిపుణులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Next Story